హైదరాబాద్ : పేదలు, రైతులు రెండు కళ్లుగా సిఎం కెసిఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌కు చెందిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తీగల సంతోష్ అతని అనుచరులు హైదరాబాద్‌లో శనివారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ కావాలనే డిమాండ్ పెరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల వల్ల పేదలకు ఒరగిందేమీ లేదని ఆయన విమర్శించారు. పచ్చగున్న తెలంగాణ మీద బిజెపి విషం చిమ్ముతుందని, కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఎవరన్ని సర్కస్ ఫీట్లు చేసినా బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.