నాచారం: నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. కనీసం ఒక పూట తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అలాంటి నిరుపేదల నడ్డి విరగొట్టే విధంగా నాచారం డివిజన్‌లోని రవి ప్రసాద్ ఏజెన్సీ ,హెచ్‌పిగ్యాస్ సిబ్బంది , యాజమాన్యం మొత్తం అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒక పక్క గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో గ్యాస్‌ను డెలివరీ చేసే సమయంలో అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాచారం ఇయస్‌ఐ హాస్పిటల్ పక్కనే ఉన్న హెచ్‌పిగ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ప్రతి గ్యాస్ వినియోగదారుడు దగ్గర నుంచి సూమారు రూ. 20 నుంచి రూ. 40 రూపాలు అధికంగా వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలసంఖ్యలో గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్న వినియోగదారుల నుంచి గ్యాస్ డెలివరీ చేస్తున్న సిబ్బంది సూమారు రూ. 20 నుంచి రూ.40లను యాజమాన్యం అండతో విచ్చలవిడిగా వసూలు చేస్తుండటంతో వినియోగదారులు తమ గోసను ఎవరికి చెప్పుకోవాలి అని వాపోతున్నారు. సమస్యలను పట్టించుకోవాల్సిన తూనీకలు కొలతల అధికారులు మాత్రం వచ్చే మామూళ్లకు నిమ్మకునీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కుటుంబాలు, నాచారం డివిజన్ , మల్లాపూర్ డివిజన్‌లోని పారిశ్రామికవాడలోని కంపెనీల్లో పనిచేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. వారికి వచ్చే జీతం రూ. 10 వేల నుంచి రూ. 14 వేల వరకు మాత్రమే ఉంటుంది. అలాంటి కుటుంబాలకు గ్యాస్‌బండ ధరతోనే మరీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పట్టించుకోవాలి అని పలుమార్లు హెచ్‌పి గ్యాస్ ఆఫీసు చుట్టు తిరిగినా లాభం లేదని వాపోతున్నారు. సమస్యలను అధికారులకు చెప్పాలని అనుకున్న వారికి కనీసం అధికారుల నెంబర్లు సైతం అందుబాటులో లేవని అన్నారు.
నూతన కనెక్షన్‌లపై కూడా సూమారు రూ. 600 రూపాయలు అధికంగా హెచ్‌పి గ్యాస్ యాజమాన్యం వసూలు చేస్తున్నారని అన్నారు. పూర్తిగా అవినీతికి పాల్పడుతున్న గ్యాస్ సిబ్బందిపై యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదంటే , దీని అర్ధం ఏమిటో అని వాపోతున్నారు. నిరుపేదల పట్ల దయ లేని హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీల నిర్వాకం పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. అధిక వసూల్ , నిర్లక్షంగా సమాధానాలు ,ఆఫీసులో ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.