మహారాష్ట్ర హైవేపై ఘోర బస్సు ప్రమాదం
25 మంది ప్రయాణికుల సజీవదహనం
అర్థరాత్రి దాటిన తరువాత నిద్రల్లోనే మృత్యువు
డ్రైవర్ , క్లీనర్ సహా ఎనమండుగురు క్షేమం
టైరు పేలిందా? డ్రైవర్ నిద్రమత్తా
కారణాల ఆరాలో అధికారులు
నాగ్‌పూర్ : మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కి బుగ్గి అయ్యారు. రాష్ట్రంలోని బుల్ధానా జిల్లాలో సింద్కెద్రజ వద్ద పింపల్‌కుట గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. 1.30 ప్రాంతంలో వేగంగా వెళ్లుతున్న బస్సు అదుపు తప్పి ఓ స్తంభాన్ని, డివైడర్‌ను ఢీకొంటూ బోల్తా పడింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కి చివరికి నిద్రలోనే కాలి మసి అయ్యారు. శరీరాలు గుర్తు పట్టలేని విధంగా మారాయి. నాగ్‌పూర్ నుంచి పుణేకు వెళ్లుతుండగా ఈ ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదానికిగురైందని పోలీసులు తెలిపారు. ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్ సహా ఎనమండుగురు మెళకువతో ఉండటంతో కిటికీలు పగులగొట్టి బయటకు రావడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ బస్సు విదర్భ ట్రావెల్స్‌కు చెందినది. నాగ్‌పుర్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పుణేకు బయలుదేరింది.
రాత్రి పూట బస్సును యావత్‌మల్ జిల్లాలోని కరంజా వద్ద రాత్రి భోజనాలకు కొద్ది సేపు నిలిపారు. ఆ తరువాత కొద్ది సేపటికే ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లుతున్న బస్సు అదుపు తప్పి కుడివైపు బోల్తా పడింది. ఈ క్రమంలో బస్సు ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ తరువాత కొద్ది నిమిషాలకే బస్సుకు మంటలు అంటుకున్నాయని బుల్దానాకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కేవలం ఎనమండుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పోలీసులు విచారించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసినట్లు వెల్లడైంది. పూర్తిగా మంటలకు ఆహుతైన వారిని ఇప్పుడు కేవలం డిఎన్‌ఎ పరీక్షల తరువాతనే గుర్తించేందుకు వీలుంది. ఈ ప్రక్రియ తరువాత భౌతికకాయాలను వారి బంధువులకు అప్పగిస్తారు.
టైరు పేలిందన్న డ్రైవర్.. అటువంటిదేమీ లేదన్న ఆర్‌టిఒ
బస్సు అదుపులోనే ఉందని, అయితే ఉన్నట్లుండి టైరు బద్ధలు కావడంతో వేగంగా పక్కకు దూసుకువెళ్లిందని బస్సు డ్రైవర్ పోలీసులకు తెలిపినట్లు వెల్లడైంది. అయితే ఈ ప్రాంతంలో టైర్ పేలుడు సంబంధిత ఆధారాలు ఏమీ లేవని, ఎక్కడ కూడా చిన్నపాటిలో అయినా రబ్బరు లేదా టైరు ముక్కలు లేవని, దీనిని బట్టి ప్రమాదం జరగడానికి కారణం టైరు పేలుడు కాదని అమరావతి రీజినల్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం (ఆర్‌టిఒ) అధికారులు తెలిపారు. టైరు పేలిన ఆనవాళ్లు లేవని, పైగా వీల్ డెస్క్ పూర్తిగా వంగిపోయి ఉందని గుర్తించినట్లు ఆర్‌టిఒ పేర్కొంది. బస్సువేగంగా వెళ్లుతుండగా అదుపు తప్పి ఓ ఇనుప స్తంభాన్ని ఆ తరువాత డివైడర్‌ను తాకుతూ వెళ్లిందని బయటపడ్డ ఓ వ్యక్తి తెలిపారు. అయితే జరిగిన ఘటనకు మానవ తప్పిదమే కారణం అని స్థానిక పోలీసు అధికారులు డ్రైవర్‌ను దీనికి బాధ్యులు చేసినట్లు వెల్లడైంది. ఘటనా ప్రాంతం అంతా భయానకంగా ఉంది. బస్సు పూర్తిగా తగులబడటం, బూడిదైన బ్యాగులు, మొబైల్ ఛార్జర్లు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. చాలా సేపటివరకూ మంటలు చెలరేగినట్లు వెల్లడైంది.
గత ఏడాది డిసెంబర్‌లోనే నాగ్‌పూర్ ముంబై సమృద్ధి మహామార్గ్ అంతర్భాంగా 520 కిలోమీటర్ల ఫేజ్ 1 రాదారిని ప్రధాని మోడీ ప్రారంభించారు. బస్సు దుర్ఘటన గురించి తెలియగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ఘటనా స్థలికి మధ్యాహ్నం వచ్చారు. చాలా దురదృష్టకరమైన ఘటన జరిగిందని షిండే ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణాల దశలో డ్రైవర్లు ఆద్యంతం అప్రమత్తతతో ఉండాలని తెలిపారు. ఈ రాదారిలో ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మానవతప్పిదాలతోనే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బస్సు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. పిల్లలు, మహిళలతో పాటు పలువురి ప్రాణాలు విషాదాంతం చెందడం తనను కలిచివేసిందని ప్రధాని మోడీ ఓ ప్రకటన వెలువరించారు. హోం మంత్రి అమిత్ షా, శివసేన నేత ఉద్ధవ్ థాకరే, కేంద్ర రాదార్ల మంత్రి నితిన్ గడ్కరీ వేర్వేరుగా ఈ ఘటనపై విచారం తెలిపారు.
డీజిల్ ట్యాంకు పేలింది ః ఫడ్నవిస్
తనకు బుల్దానా ఎస్‌పి ఇచ్చిన ప్రాధమిక సమాచారం ప్రకారం బస్సు ముందు స్తంభాన్ని ఢీకొనడం తరువాత డీజిల్ ట్యాంకు పేలుడతో మంటలు చెలరేగినట్లు తెలిసిందని ఉపముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు. ట్యాంకు పేలడంతో దట్టంగా మంటలు చెలరేగాయని వెల్లడించారు. అయితే ఈ రాదారిపై ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని శివసేన (యుబిటి ) అధ్యక్షులు, మాజీ సిఎం ఉద్ధవ్ థాకరే విమర్శించారు. గత ఏడాది దీనిని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ 300 మందికి పైగా ప్రమాదాలలో మృతి చెందారని, అయినా ఇప్పటికీ ఎటువంటి చలనం లేదని స్పందించారు.
డ్రైవర్ కునికిపాట్లే కారణం: హైవేల పోలీసు అధికారి వెల్లడి
తాము జరిపిన ప్రాధమిక విశ్లేషణలో బస్సు డ్రైవర్ నిద్రతో కునికిపాట్లతో బస్సును నడపడంతో ఇది వేగంగా పక్కకు దూసుకుపోయి ఘోర ప్రమాదానికి దారితీసినట్లు వెల్లడైందని మహారాష్ట్ర హైవే పోలీసు అధికారి ఒక్కరు తెలిపారు. బస్సు టైరు పగిలి ప్రమాదం జరిగిందనే డ్రైవర్ వాదన సరికాదన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు 60 లేదా 70 కిలోమీటర్ల సగటు వేగంతో ఉండి ఉంటుందని ఇది బయలుదేరిన చోటు మధ్యలో ఆగి తిరిగి బయలుదేరి ప్రమాద స్థలికి చేరుకున్న సమయాన్ని బట్టి వేగాన్ని నిర్థారించినట్లు తెలిపారు. తక్కువ వేగంతోనే బస్సు వెళ్లినా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో అదుపు కోల్పోయి మంటలు చెలరేగినట్లు తెలుస్తోందని అధికారి పేర్కొన్నారు. ఇది పూర్తిగా మానవతప్పిదం అయినట్లు చెప్పారు.