చౌటుప్పల్ : జల్సాలు, తాగుడుకు అలవాటుపడి బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల ముఠా సభ్యులను శనివారం చౌటుప్పల్‌లో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి మొగులయ్య తెలిపారు. స్థానిక ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బైక్ చోరీలకు సంభంధించి ఎసిపి వెల్లడించిన వివరాలు… చౌటుప్పల్ పురపాలక పరిధిలోని తంగడపల్లికి చెందిన సంపంగి శివ (21), మండలంలోని అంకిరెడ్డిగూడెంకు చెందిన ముద్దంగుల సింహాద్రి (20) లు వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌లుగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. వచ్చిన ఆదాయంతో సంతృప్తి చెందక జల్సాలు, తాగుడుకు బానిసలై కష్టం లేకుండా అవలీలగా సంపాదించే పథకం ఆలోచించారు.
ఇద్దరూ కలిసి బైక్ చోరీలు చేసి అమ్మాలని నిర్ణయించారు. గత కొద్ది రోజులుగా చౌటుప్పల్, హయత్‌నగర్, చివ్వెంల ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడి మొత్తం 10 బైక్‌లను దొంగిలించారు. దొంగిలించిన బైక్‌పై హైదరాబాద్ వెళ్లి వారు దాచివుంచిన బైక్‌లను అమ్మే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు కలిసి వెళుతుండగా చౌటుప్పల్‌లో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చోరీల విషయం పూర్తిగా బయట పడినట్లు ఎసిపి మొగులయ్య వివరించారు. ఈ విలేకర్ల సమావేశంలో చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్.దేవేందర్, ఎస్‌ఐ కె.యాదగిరి, ఇతర పోలీసు సిబ్బంది కె.శోభన్‌బాబు, వై.కాశయ్య, పి.శ్రీను, సైదులు పాల్గొన్నారు.