Thursday, January 23, 2025

మహాలో బిఆర్‌ఎస్‌కు ఆదరణ

- Advertisement -
- Advertisement -

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బిఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. దేశంలో భారత్ రాష్ట్ర సమితి విస్తరణ కోసం పెద్ద కసరత్తే చేస్తోంది అందులో మొదటగా మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ తమ సత్తా చాటాలనుకుంటున్నారు. రైతు ప్రభుత్వం పేరుతో మహారాష్ట్రలో ఇప్పటికే పలు బహిరంగ సభలను నిర్వహించి, పార్టీ కార్యాలయాలని ఏర్పాటు చేసి తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సభలలో పలు రాష్ట్ర స్థాయి అన్ని పార్టీలకి చెందిన నాయకులు, సీనియర్ అధికారులు బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో కెసిఆర్ ప్రసంగాలు మహారాష్ట్రలో సాగాయి, అలాగే పలు మహారాష్ట్ర రైతులు, నాయకులు సైతం తెలంగాణకు వచ్చి ఇక్కడి అభివృద్ధి గురించి తెలుసుకుని వెళ్లారు.

తమ హక్కుల కోసం వీధుల్లో ధర్నాలు చేయకుండా ఉండేందుకు రైతులు తమకు ఓటు వేసి వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో ‘కిసాన్ సర్కార్’ తీసుకురావాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ రైతులకు ప్రతి సమావేశంలో బలంగా చెప్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతివ్వాలని, ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని సాకారం చేసేందుకు కృషి చేయాలని రైతులను కోరుతున్నారు. గుణాత్మక అభివృద్ధికి సంప్రదాయేతర విధానాలు అవసరమని పేర్కొంటూ దేశ రాజకీయ రంగంలో పరివర్తనాత్మక మార్పుల ఆవశ్యకతను, మార్పు కోసం ప్రజల ఆకాంక్షను గుర్తించి, వారి స్వంత విధిని రూపొందించుకోవడంలో రైతుల ఓట్ల ప్రాముఖ్యతను గుర్తించిన కెసిఆర్ ‘కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వ్యవసాయ దేశమైన ఇండియా జనాభాలో 42 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో రైతులు ఉంటారు, రేపటి రోజున వీరే గెలుపు ఓటములలో కీలకం. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమాలు దేశంలో ఏ విధంగా ప్రభావితం అయ్యాయో చరిత్ర చెపుతుంది కాబట్టి బిఆర్‌ఎస్ ఎన్నుకున్న ఈ కిసాన్ నినాదం తప్పకుండా ప్రభావితం అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.

తెలంగాణ మోడల్‌ను అమలు చేయడం వల్ల మహారాష్ట్రలోని రైతుల జీవితాలు సుభిక్షంగా ఉంటాయని, సామాజికంగా వెనుకబడిన దళితుల నుండి ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడం, దేశంలో తెలంగాణ నూతన పథకాలు, తెలంగాణ రాష్ట్రం పలు రంగాలలలో సాధించిన విజయాలు, ఉత్తమ పద్ధతులు అన్ని పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా అమలు పరిచి మహారాష్ట్రని కూడా అభివృద్ధి పథంలో తీసుకు రావాలని బిఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తుంది. రాజకీయ నాయకత్వ అసమర్థత కారణంగా మహారాష్ట్ర వంటి ధనిక రాష్ట్రంలో అభివృద్ధి వెనుకబడిందని, రైతులకు లాభదాయకమైన అవకాశాలను కల్పించేందుకు వారిని అన్ని విధాల ఆదుకునేలా, రాష్ట్ర బియ్యం ఉత్పత్తిని ప్రాసెస్ చేయడానికి మహారాష్ట్రలో రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో మహారాష్ట్ర రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, నాణ్యమైన సాగునీరు అందిస్తామని ఇలాంటి పలు గుణాత్మక హమీలని ఇప్పటికే జనాల్లో తీసుకెళ్ళారు. కానీ విస్తరణ మొదలు పెట్టిన మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ సభ్యత్వం ఇప్పటికే దాదాపు 10 లక్షలు దాటిందని, త్వరలో 50 లక్షలకు చేరుకుంటుందని పార్టీ వర్గాల వాదన.

దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ పార్టీని విస్తరించాలనే కెసిఆర్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, బిఆర్‌ఎస్ ప్రతీ బహిరంగ సభలకు విశేష స్పందన రైతులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల, యువత వంటి సమాజంలోని వివిధ వర్గాలపై దృష్టి సారించి, ప్రజలతో మమేకమై సమాచారాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు గ్రామ స్థాయి లో కమిటీలను ఏర్పాటు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులను ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌కి లభిస్తున్న ఆదరనతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రజల ఆదరణతో పలు శాసనసభ సీట్లని గెలిచి, మహారాష్ట్రలో గుర్తింపు పొందిన పార్టీగా పేరు తెచ్చుకుంటుంది ఎందుకంటే వచ్చే ఎన్నికల సమయానికే మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ సభ్యులు, నాయకులు పెరిగి తెలంగాణ మాడల్ అభివృద్ధి పథకాలని ప్రచారం చేసి మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ ఒక ప్రముఖ స్థానాన్ని పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ విధంగా చూస్తే ఆప్ పార్టీ తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందటానికి ఎక్కువ సమయం పట్టదు. మహారాష్ట్ర మాదిరిగా పలు రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఫోకస్ చేస్తే అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకొని జాతీయ క్రియాశీల రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని మేధావుల అభిప్రాయం. ఏదిఏమైనా దక్షిణాది నుండి ఎంతో చరిత్ర, ప్రభావవంతమైన ప్రాంతీయ పార్టీలు వున్నప్పటికీ కెసిఆర్ జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ కోసం, దేశంలో గుణాత్మక అభివృద్ధి జరగాలని భారత దేశాన్ని ప్రపంచంలో బలమైన వ్యవస్థగా అభివృద్ధి చేయాలనీ ఎన్నుకున్న ఈ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం విజయవంతం కావాలని కోరుకుందాం!.

డా. కందగట్ల శ్రవణ్ కుమార్
8639374879

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News