Monday, November 18, 2024

రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మారనున్న కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెలలో ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనున్న కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మారనుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం ఉపాధి అవసరాలు, ఆర్థికాభివృద్ధి రైల్వేల సరకు రవాణా కోసం మరిన్ని వ్యాగన్ల అవసరం నిమిత్తం కేంద్రం దీనిని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మార్చనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అందులో భాగంగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మారనున్న నేపథ్యంలో పలు మార్పులు రానున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అయితే దీనివల్ల ఎంతవరకు రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న దానిపై రైల్వే అధికారులు నోరు మెదపడం లేదు.

లేఔట్‌లో మార్పులు
స్ట్రిప్పింగ్ షాప్, షీట్ మెటల్ షాపులు ఒకదానికొకటి పక్కపక్కనే ఉండే విధంగా లేఔట్‌లో మార్పు. సరైన జిగ్స్, ఫిక్చర్స్‌ను ఉపయోగిస్తూ సైడ్ వాల్స్, ఎండ్ వాల్స్‌ను తయారు చేసేందుకు వీలుగా స్ట్రిప్పింగ్ షాప్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. బాడీషాప్, వీల్‌షాప్, పెయింట్ షాప్, స్టోర్‌వార్డ్‌లలో ఎటువంటి మార్పులు చేయడం లేదు.

యంత్రాలు, ప్లాంట్‌లలో మార్పులు
అదనపు ఎంపి అనగా గ్యాంగ్ డ్రిల్లింగ్ యంత్రం, షేరింగ్ యంత్రం, బెంచ్ ప్రెస్, యూనివర్సల్ అండర్ ప్రేమ్ వెల్డింగ్ మ్యానిపులాటర్స్, స్ట్రైటెనింగ్ యంత్రం, హుక్ బోల్టింగ్ యంత్రాలు అదనంగా ప్రస్తుతం అవసరం. అదనంగా జిగ్స్, ఫిక్చర్స్ స్థాపించాల్సి ఉంటుంది.
తయారీ సామర్థ్యపు అంచనా
మొదటి సంవత్సరం -1200 వ్యాగన్లు ( నెలకు 100 వ్యాగన్ల చొప్పున). రెండో సంవత్సరం – 2400 వ్యాగన్లు (నెలకు 200 వ్యాగన్లు చొప్పున) ఈ సామర్థాన్ని, అధిక సైడ్ వాల్స్, ఎండ్ వాల్స్ తయారీ, వీల్ షాప్, పెయింట్ షాప్ సామర్థ్యంపై ఆధారపడి పెంచుకునేలా ఏర్పాట్లు.

భూమి అప్పగింతలో సీమాంధ్రుల నిర్లక్షం
కాజీపేటకు మంజూరైన రైల్వే వ్యాగన్ రిపేరింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్) షెడ్ల నిర్మాణానికి గతంలో రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రంలో యూపిఏ సర్కారు ఉన్న సమయంలో ఇక్కడ రైల్వే వ్యాగన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 55 ఎకరాలు కావాలని రైల్వేశాఖ కోరింది. అప్పటి సీమాంధ్ర పాలకులు భూమిని అప్పగించడంలో జాప్యం చేశారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అయోధ్యపురం గ్రామ శివారులో దేవాదాయ శాఖకు చెందిన భూమిని కొనుగోలు చేసి రైల్వేశాఖకు అప్పగించింది. అయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం 2016-,17 రైల్వే బడ్జెట్‌లో కాజీపేటలో వ్యాగన్ రిపేరింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్), వ్యాగన్ మ్యాన్యుఫ్యా క్చరింగ్ యూనిట్‌ను నిర్మిస్తామని పేర్కొంది. అందుకు160 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటికే దాదాపు 54 ఎకరాల 32 గుంటల భూమి ఉందని, మరో 105 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పింది. ఈక్రమంలో 150 ఎకరాల భూమిని 2022 సెప్టెంబర్ 23న రైల్వేశాఖకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. మిగతా 10 ఎకరాల భూమిని తర్వాత అప్పగిస్తామని చెప్పింది.

ఈ సంవత్సరం జనవరిలో టెండర్లు పూర్తి
రాష్ట్ర ప్రభుత్వ హామీతో రైల్వేశాఖ ఆర్వీఎన్‌ఎల్ సంస్థ ఆధ్వర్యంలో 2023 జనవరిలో వ్యాగన్ రిపేరింగ్ వర్క్ షాప్(పిఓహెచ్) ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. పవర్ మేక్ ప్రాజెక్టు కంపెనీ రూ.360 కోట్లతో కోట్ చేసి టెండర్‌ను దక్కించుకుంది. 2025 ఫిబ్రవరిలోపు పనులను పూర్తి చేయాలని టెండర్ షెడ్యూల్‌లో రైల్వే శాఖ పేర్కొంది. కాగా, కేంద్ర ప్రభుత్వ పట్టింపులేమితో పనుల్లో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖపై ఒత్తిడి పెంచడంతో ఇటీవల పీఓహెచ్ షెడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ భూమిలో జంగిల్ కట్టింగ్, చదును, ప్రహరీ, తాత్కాలిక కార్యాలయాల షెడ్లను నిర్మిస్తున్నారు. శాశ్వత కార్యాలయ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. వర్క్ షాప్‌లో పది రైల్వే ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వే చేశారు. పీఓహెచ్ అందుబాటులోకి వస్తే దాదాపు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా మరో 4వేల మంది ఉపాధి పొందనున్నారు. 1982లో తొలిసారిగా కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు కాగా, 2010లో వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రతిపాదన పలు కారణాలతో వెనక్కి వచ్చింది. ప్రస్తుతం కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్‌ను రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించడంపై అధికారుల్లో గందరగోళం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News