Saturday, November 23, 2024

జలమండలిలో ‘క్లోరిన్’ హల్‌చల్

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: ‘జలమండలి అలియాబాద్‌లో ఐదు రోజులుగా కలుషిత నీరు… క్లోరినేషన్ లోపమంటున్న జనం’ అన్న శీర్షికన శనివారం ‘మనతెలంగాణ’లో ప్రచురితమైన వార్త వాటర్‌వర్క్‌లో హల్‌చల్ చేసింది. రిజర్వాయర్ పరిధిలో గత ఐదు రోజులుగా కలుషిత మంచినీరు సరఫరా అవుతోందని, పలు బస్తీల ప్రజలు బాటిళ్ళలో నీళ్లు తీసుకొని స్థానిక రిజర్వాయర్ వద్దకు క్యూకట్టారు. అయితే అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయమై ‘మన తెలంగాణ’ లోతుగా విశ్లేషించగా అసలు విషయం బయట పడింది. గత కొన్ని రోజులుగా రిజర్వాయర్ నీటిలో క్లోరిన్ కలపటం లేదని తేలింది.

ఫలితంగా మంచినీరు రంగు మారి, మట్టి, నాచువాసనతో సరఫరా అవుతుంది. అలియాబాద్, బేలా, జంగమ్మెట్ సెక్షన్ల పరిధిలోని అలియాబాద్, కాల్వగడ్డ, ఊంటోంకి మైదాన్, జగన్నాథస్వామి టెంపుల్, మేకలబండ, సయ్యద్ అలీ చబుత్ర, దూద్‌ఖానా, శ్రీరాంనగర్‌కాలనీ, పార్థివాడ, శివాజీనగర్, శివగంగానగర్ తదితర బస్తీలకు మంచినీరు మబ్బు, చెత్తాచెదారం, వాసనతో కూడి వస్తున్నాయి. అయితే రిజర్వాయర్ నీటిలో క్లోరిన్ కలిపే యంత్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవటం వల్ల నీటిలో క్లోరిన్ కలపటం మానేశారు. అంతేకాకుండా క్లోరిన్ గ్యాస్ పంపే యంత్రాలు సైతం మరమ్మతుకు వచ్చాయి. దీంతో కృష్ణా నుంచి రిజర్వాయర్‌లోకి వచ్చిన నీటికి క్లోరిన్ కలపటం లేదు. ఈ విషయాన్ని స్థానిక లైన్‌మె న్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా స్పందించలేదని తెలిసింది. వార్తతో చలించిన అధికారులు సిబ్బందిపై మండిపడ్డారు.

విషయం ఎలా బయటకు పొక్కింది, రిజర్వాయర్ లోపలికి ఎవరూ రాకుండా గట్టిగా కాపలా ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆయా సెక్షన్ల లైన్‌మెన్లు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పుడో తీసుకువచ్చారు. తాజాగా రిజర్వాయర్ నీటిని అధికారుల ముందే పరీక్షించగా నీళ్లు తెల్లగా మారాయి. క్లోరిన్ కలిపితే పసుపు రంగులోకి మారుతాయి. దీనిని బట్టి రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిలో క్లోరిన్ కలపటం లేదన్న విషయం స్పష్టమైయ్యింది. తప్పు గ్రహించిన అధికారులు సమస్యను పరిష్కరించాల్సింది పోయి సిబ్బందిపై మండిపడటం విమర్శలకు దారి తీసింది. వారి పనితీరుకు అద్దం పడుతుంది. రిజర్వాయర్ నీటిలోకి క్లోరిన్‌ను పంపే యంత్రాన్ని, దానికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను జలమండలి సిబ్బంది ఎట్టకేలకు పునఃరుద్దరించారు. దీంతో ఆదివారం నుండి రిజర్వాయర్ నీటికి క్లోరిన్ కలిపి ఆ నీటిని బస్తీలకు సరఫరా చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News