Saturday, December 21, 2024

భూ నిర్వాసితులకు ఉద్యోగాలిస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / కాజీపేట/హన్మకొండ ప్రతినిధి: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని అయోధ్యపురం శివారులో రైల్వే వ్యాగన్ (పివోహెచ్) రిపేరింగ్ వర్క్‌షాప్, రైల్వే వ్యాగెన్ తయారీ పరిశ్రమల షెడ్ల ఏర్పాటు స్థలాన్ని కేంద్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అదివారం పరిశీలించారు. ఆయనతో పాటు రైల్వే డిఆర్‌ఎం ఏకె గుప్తా, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, సిపి రంగనాథ్, ఎంపి బండి సంజయ్, రైల్వే ఉన్నతస్థాయి అధికారులు ఉన్నారు. కాజీపేటలో ఈనెల 8న దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రైల్వే వ్యాగెన్ (పివోహెచ్) రిపేరింగ్ వర్క్ షాప్, రైల్వే వ్యాగెన్ తయారీ పరిశ్రమల షెడ్‌ల శంకుస్థాపన పనులు ప్రారంభం చేయనున్న నేపథ్యంలో ముందస్తుగా కిషన్‌రెడ్డి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రైల్వే డిఆర్‌ఎం ఏకె గుప్తా, సీనియర్ డిఎంఈ ( కో ఆర్డినేషన్) క్రిష్ణారెడ్డిలు రైల్వే వ్యాగెన్ పరిశ్రమల లేఅవుట్ మ్యాప్ సహాయంతో షెడ్ కోసం నిర్మాణం చేసే కార్యాలయాలు, రైలు పట్టాలు పలు అంశాలను ఆయనకు తెలిపారు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభు త్వం అధికార యంత్రాంగం కేటాయించిన స్థలం అనువుగా ఉందని మంత్రి అధికారులకు కితాబు ఇచ్చారు.

అయోధ్యపురం మాజీ సర్పంచ్ గాదె యాదగిరి ఆధ్వర్యంలో పలువురు భూ నిర్వా సితులు మంత్రిని కలిసి రైల్వే పరిశ్రమల కోసం 114 మంది రైతులు భూమిని కోల్పోయామని మాకు జీవనాధారం కోసం వ్యాగన్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు, వెంటనే స్పందించిన మంత్రి భూ నిర్వాసితులందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులు మాట్లాడుతూ వ్యాగన్ పరిశ్రమకు భవిషత్తులో మరో 80 ఎకరాల భూమి అవసరం ఉంటుందని , కావల్సిన భూమిని రైల్వే శాఖ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుందని , ప్రస్తుతం ఏర్పాటు అయ్యే రైల్వే వ్యాగెన్ (పివోహెచ్) రిపేరింగ్ వర్క్ షాప్, రైల్వే వ్యాగెన్ తయారీ పరిశ్రమలలో దాదాపు 7800 మంది ఉ ద్యోగాలు పొందుతారని తెలిపారు. భవిష్యత్ లో80 ఎకరాల భూమీ తీసుకొని రైల్వే శాఖ అప్ గ్రేడ్ అయితే మరో 2వేల మందికి ఉద్యోగాలు పెరుగనున్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ, ఆర్డిఓ వాసు చంద్ర, కాజీపేట తహాసీల్దారు కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా ఈనెల 8న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓరుగల్లుకు వస్తున్నారని తెలిపారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు వరంగల్ ప్ర జలు ఎదురుచూస్తున్నారన్నారు. అభివృద్ధి పనుల ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపన కోసం వరంగల్ వస్తున్నారని తెలిపారు. వెయ్యి స్తంభాల గుడి మండపంలోని శిథిలావస్థకు చేరిన కల్యాణ మండపాన్ని పూర్తిస్థాయిలో రిపేర్ చేస్తున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 10 జిల్లాలను కలుపుకొని ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణకు రూ. 500 కోట్లను కేంద్రం కేటాయించిందన్నారు. నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ. 26వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించిందని, భూ సేకరణ పూర్తయిన వెంటనే పను లు ప్రారంభిస్తామన్నారు. కేంద్రం రూ. 500 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూపాయి కూడా లేదన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ రైలును విస్తరించేందుకు రూ. 330 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో ఎంఎంటీఎస్ విస్తరణ ఆలస్యమైందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్‌తోపాటు వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నామన్నారు. వ్యాగన్ తయారీ పరిశ్రమలో రోజుకు 200 వ్యాగన్లు తయారు చేసే సామర్థం ఈ పరిశ్రమకు ఉంటుందన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ స్థాయిలో ఉన్న వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రధానమంత్రి ఇచ్చారని దీనికి భూమి పూజ స్వయంగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News