మేడ్చల్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సాయిబాబాను మొక్కినట్లు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మేడ్చల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో సోమవారం గురుపౌర్ణమి ఘనంగా నిర్వహించారు.
గురుపౌర్ణమి పురస్కరించుకొని ఆలయంలో సత్యనారాయణస్వామి వ్రతాలతోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు గురువులందరినీ పూజించుకునే సంస్కృతి మనదని అన్నారు. సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వీర్లపల్లి రజిత రాజ మల్లారెడ్డి, జడ్పిటిసి శైలజ విజయానంద రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేష్, మేడ్చల్ మున్సిపల్ బిఆర్‌ఎస్ అధ్యక్షులు శేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి విష్ణుచారి, మేడ్చల్ మాజీ ఉపసర్పంచ్ నరసింహారెడ్డి, కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.