Monday, November 25, 2024

పార్టీల ఆర్థిక వివరాల నమోదుకు ఇసి ఆన్‌లైన్ పోర్టల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలు, పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఖర్చులు, పార్టీలకు వచ్చిన విరాళాలు తదితర వివరాలను వెల్లడించడానికి వీలుగా కొత్తగా ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. అక్రమ నిధులను అరికట్టడం, పార్టీల నిధులు, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలోపేతం చేసే లక్షంగా 3 సీ వ్యూహంలో భాగంగా ఈ పోర్టల్‌ను తీసుకువచ్చినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ పోర్టల్ రూపకల్పన కోసం చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఏడాదిగా పనిచేస్తున్నట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

పార్టీలు తమ ఆర్థిక వివరాలను ఆన్‌లైన్‌లో ఇవ్వకూడదని భావిస్తే అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని , ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించలేకుంటే నిర్దేశించిన ఫార్మాట్‌లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌కాపీ ఫార్మాట్‌లో నివేదిక అందజేయవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్థిక నివేదికలు దాఖలు చేయనందుకు పార్టీ పంపిన సమర్ధన లేఖతోపాటు అలాంటి అన్ని నివేదికలను ఆన్‌లైన్‌లో ప్రచురించడమౌతుందని కమిషన్ వివరించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు కమిషన్ లేఖలు పంపింది.

ఇలా వెబ్ పోర్టల్‌లో నివేదికలను అందించడం ద్వారా రాజకీయ పార్టీలకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా అధిగమించవచ్చని , పారదర్శకత స్థాయి కూడా పెరుగుతుందని కమిషన్ పేర్కొంది. 1951ఎన్నికల కమిషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మార్గదర్శకాలను అనుసరించి పార్టీలు తమ నివేదికలను సమర్పించాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News