పెషావర్ : కల్లోలిత బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రావిన్స్ లోని బెలోర్ రీజియన్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు విరుచుకు పడ్డారని పాకిస్థాన్ మిలిటరీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) మీడియా విభాగం వెల్లడించింది. ఈ దాడిలో మేజర్ ర్యాంకు ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారని ,
మరో జవాను తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించారు. భద్రతా దళాలపైన పౌరుల పైన అనేక సార్లు ఈ గ్రూపు ఉగ్రవాదులు దాడులు జరిపిన సంఘటనలు ఉన్నాయి. బెలోచిస్థాన్‌లో సుస్థిరత, శాంతి భద్రతలకు విఘాత ం కలిగించడమే లక్షంగా ఈ గ్రూపు ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దుండగుల కోసం గాలింపు జరుగుతోంది. శనివారం ముగ్గురు పోలీస్‌లు, ఒకసైనికుడు ఉగ్రదాడికి మృతి చెందారు.