పెద్దపల్లి: ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు చేపట్టాలని, వాటి వివరాలను వాట్సప్ ద్వారా పంపాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణ కార్యక్రమ పోస్టర్‌ను కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సంవత్సరానికి జిల్లాలోని గ్రామీణ, పట్టణ ఔత్సాహికులు ఆవిష్కరణలలో తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు.
ప్రతి సంవత్సరం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, వ్యవసాయ రంగ ఆవిష్కరణలు, సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు తదితర అంశాలు ఇందులో ప్రదర్శించవచ్చిన, వాటికి సంబంధించిన ప్రదర్శనకు గల రెండు నిమిషాల వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫోటోలు, ఆరు వ్యాఖ్యలతో ఆసక్తి గల వారు 9100678543 నెంబర్‌కు వాట్సప్ ద్వారా వృత్తి, ఊరి పేరు, జిల్లా పేరుతో వివరాలను పంపించాలన్నారు. వీటిని ఆగస్టు 5 లోగా పంపవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, జిల్లా అధికారులు మాధవి, శ్రీధర్, చంద్రమౌళి, ఆదిరెడ్డి, రంగారెడ్డి, కవిత, ప్రణయ్ కుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.