న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆప్ నేత మనిష్ సిసోడియా బెయిల్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 9వ తేదీన అరెస్టు చేసింది. పలు కారణాలతో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి దినేష్ కుమార్ శర్మ తెలిపారు. అత్యంత కీలక కేసు విచారణలో నిందితుడు తనకు బెయిల్‌కు సంబంధించి మూడు కీలక పరీక్షలలో నెగ్గాల్సి ఉంటుంది.
విచారణ నుంచి తప్పించుకోబోనని, సాక్షాలను తారుమారు చేయనని, వారిపై ఒత్తిడి తీసుకురాబోనని ఆయన నిరూపించుకోవల్సి ఉంటుందని, ఈ అంశాల ప్రాతిపదికనే తాము ఈ కేసులో బెయిల్ ఇవ్వడం జరుగుతుందని న్యాయమూర్తి తెలిపారు. సిసోడియాతో పాటు ఈ కేసులో సహ నిందితులైన అభిషేక్ బోయినపల్లి, బెనయ్ బాబు, విజయ్ నాయర్‌ల బెయిల్ దరఖాస్తులను కూడా హైకోర్టు తిరస్కరించింది.