జన్నారం: కవ్వాల టైగర్‌జోన్‌లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న అక్రమ కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇస్లాంపూర్ అడవిలో నుండి అదే గ్రామానికి చెందిన కొందరు కలప స్మగ్లర్లు ట్రాక్టర్‌లో 6 విలువైన దుంగలను జన్నారం వైపు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో మాటు వేసి పట్టుకోవడం జరిగిందని ఇందన్‌పల్లి రేంజ్ ఆఫీసర్ హఫీజోద్దీన్ తెలిపారు.
ఇస్లాంపూర్‌కు చెందిన కనక జైతు అనే వ్యక్తితో పాటు మరికొందరు కలపను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించగా తమను చూసి స్మగ్లర్లు పటపటాయిస్తున్నట్లు గమనించి పట్టుకోవడం జరిగిందని, ట్రాక్టర్‌తో సహా కలపను ఇందన్‌పల్లి రేంజ్‌కు తరలించడం జరిగిందని తెలిపారు.
అదే విధంగా జన్నారం మండలం టీజిపల్లి గ్రామ సమీపంలో గల చెట్లలో ఇతరులకు అనుమానం రాకుండా గడ్డి వాము కింద దాచి ఉంచిన మరో ఆరు దుంగలను దాచినట్లు సమాచారం రావడంతో తమ సిబ్బందితో వెళ్లి ఆ కలపను స్వాదీనం చేసుకోవడం జరిగిందని జన్నారం రేంజ్ ఆఫీసర్ లక్ష్మినారాయణ తెలిపారు. ఈ కలప విలువ సుమారు 86 వేలు ఉంటుందని తెలిపారు.
రెండు చోట్ల దొరికిన కలప విలువ లక్షా 72 వేలు ఉంటుందని హఫీజోద్దీన్, లక్ష్మినారాయణలు తెలిపారు. పట్టుకున్న వారిలో మొబైల్ పార్టీ డీఆర్‌వో శ్రీరాంనాయక్, జన్నారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, బీట్ ఆఫీసర్ రహీమోద్దీన్, తదితరులు ఉన్నట్లు వారు తెలిపారు.