Saturday, November 23, 2024

రాజకీయ నిర్వచనం ‘సోలిపేట’ జీవితం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలై రాజ్యసభలో రాణింపుతో గడిచిన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనునిత్యం పేద ప్రజలకు అంకితం చేసిన సోలిపేట రామచంద్రారెడ్డి జూన్ 27 న 92 వ ఏట కన్నుమూశారు. నూనూగు మీసాల వయసులో ఒంటబట్టిన కమ్యూనిస్టు భావజాలాన్ని ఆచరణ రూపంలో తుది శ్వాస వరకు నిలుపుకున్న అరుదైన జననాయకుడు ఆయన. పార్టీ ఏదైనా, పదవి ఏదైనా నడకంతా వామపక్ష పంథాలోనే. ప్రతి ప్రజా సమస్యను మార్క్సిస్టు సిద్ధాంత స్టెతస్కోపుతో పరీక్షించిన అభినవ వైద్యుడు. మన పార్టీలో ఉండి ప్రజా సమూహాల్లో ఉద్యమాల బాట మాట్లాడుతాడేమని సొంత పార్టీ పెద్దలే కునుకు వహించినా మాట మార్చలేదు. ఓ దశలో ఆ కారణంగానే ఆయనకు రెండో సారి రాజ్యసభకు దక్కలేదని అంటారు. దానికి ఆయన చింతించకుండా తన దోవలో తాను మరింత హుషారుగా సాగిన సందర్భాలున్నాయి. 88 ఏళ్ల వయసులో హుస్నాబాద్‌లో జరిగిన గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సభల్లో పాల్గొని ప్రసంగించడం ఒక ఉదాహరణ. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంచి సోలిపేట ఆకాంక్షను నెరవేర్చింది.

సుమారు 70 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఉన్నత విద్యకు వెళ్లకుండా రాజకీయాల వైపు రావడమే ఆయన జీవన ప్రస్థానాన్ని పూర్తిగా మార్చి వేసింది. హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో రామచంద్రారెడ్డి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అప్పుడే అక్కడే ఆయనకు మొయినొద్దీన్ అనే తెలంగాణ సాయుధ పోరాట అజ్ఞాత యోధుడితో పరిచయం ఏర్పడింది. అలా విద్యార్ధి దశలోనే సోషలిస్టు భావజాలానికి ఆకర్షితుడైనారు. 1952లో భారత కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాతం నుండే హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రచారంలో క్రియాశీల కార్యకర్తల అవసరం వల్ల రామచంద్రారెడ్డి చదువుని పక్కనపెట్టి పూర్తికాలం పార్టీ తరపున పనిచేశారు. రెండు అసెంబ్లీ స్థానాల ప్రచార బాధ్యతను పార్టీ ఈయనకు అప్పగించింది. సాహిత్యం కళలపై పట్టుఉన్న ఆయన నాటకాలు రచించి ఎన్నిక ప్రచార వేదికలపై ప్రదర్శించారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకి ఎంతో కృషి చేసిన రామచంద్రారెడ్డి కార్యదక్షతను, క్రమశిక్షణను మెచ్చుకొన్న దుబ్బాక ఎమ్మెల్యే గురువారెడ్డి ఆయనను రాజకీయాల వైపు ఆహ్వానించారు. అంతటితో చదువు ఆపేసిన రామచంద్రారెడ్డి గ్రామ స్థాయిలో తమ రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు.

ఇరువై నాలుగేళ్ల వయస్సులోనే ఆయన తమ సొంత గ్రామమైన చిట్టాపూర్ సర్పంచిగా 1957 లో ఎన్నికై రెండు పర్యాయాలు కొనసాగారు.ఆ తర్వాత 1964 దుబ్బాక సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండేళ్ల పాటు సిద్దిపేట వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 1972 లో రెడ్డి కాంగ్రెస్ పిలిచి టికెట్ ఈయడంతో ఆ ఎన్నికల్లో దొమ్మాట ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో హైదరాబాద్‌కు మకాం మార్చి ఎమ్మెల్యే పనులతో పాటు సోషలిస్టు స్టడీ సెంటర్ కన్వీనర్‌గా కొనసాగారు. వామపక్ష యువతకు వారి ఇల్లు కేంద్రం గా ఉండేది. ఇంట్లోనే బ్యానర్లు, ప్లకార్డులు సిద్ధమయ్యేవి. ఆ సంస్థ తరపున బ్లాక్ మార్కెటింగ్‌పై పోరాటాలు జరిపి అక్రమ నిల్వ దారులు అరెస్టు చేయించారు. ఆ తర్వాత కొంత కాలం మెదక్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా ఉన్నారు. 1978 నుండి రాజకీయాలకు దూరంగా గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేశారు. 1984లో ఎన్‌టి రామారావు ఆహ్వానంతో రామచంద్రారెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరారు. 1987 నుండి పదేళ్ల పాటు టిడిపికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తిరిగి ప్రత్యక్ష ఎన్నికల్లోకి రమ్మని ఎన్‌టిఆర్ కోరినా నామినేటెడ్ పదవి చాలన్నారు. ఆ క్రమంలోనే 1988 ఆయనకు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు. మరో నామినేటెడ్ పదవి అందుకొని 1994లో మెదక్ జిల్లా నుంచి తొలివ్యక్తిగా రాజ్యసభలో అడుగు పెట్టారు. 1996 2002 వరకు సభలో టిడిపి ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు.

రామచంద్రారెడ్డి తన పదవి కాలంలో 877 సార్లు ప్రశ్నలు, ప్రస్తావనలు, చర్చల్లో పాల్గొన్నారని రాజ్యసభ రికార్డుల్లో ఉంది. ఆ సమయంలో ఆయన ఎన్నో పార్లమెంట్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. తన విదేశీ పర్యటనల ద్వారా వచ్చిన అనుభవాలతో వివిధ రంగా ల్లో అభివృద్ధికి దోహదపడ్డారు. వెనుకబడిన జిల్లా అయిన మెదక్ లో తొలిసారిగా నర్సాపూర్‌లో బివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అనుమతుల కోసం ఎంతో కృషి చేసి సాధించారు.రాజకీయంగా ఏ వైపు ఉన్నా తనలోని కమ్యూనిస్టు మూలాలకు న్యాయం చేస్తూ సాగడం అనే అరుదైన ప్రత్యేకతను సోలిపేట జీవితంలో చూడవచ్చు. తన మనసుకు దగ్గరైన భారత, చైనా మిత్ర మండలి, సిఆర్ ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టుల్లోనూ ఆయన గణనీయ పాత్ర పోషించారు. రాష్ట్ర, కేంద్ర స్థాయి వివిధ పదవుల్లో కొనసాగినా రామచంద్రారెడ్డి తన మాట తీరులో, నడవడికతో ఏనాడూ నీతి నియామాల్ని జవదాటలేదు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయిన అరుదైన ప్రజానేత ఆయన. ఆయన జీవన సరళత, నిరాడంబరత అందరినీ ఆకర్షించేది. భారత్ చైనా మిత్ర మండలితో ఆయన అనుబంధం విడదీయరానిది.

వయసును లెక్క చేయకుండావారి కార్యక్రమాల్లో పాల్గొంటూ చైనా జీవన విధాన వైవిధ్యాన్ని, భారత్, చైనా మైత్రి మధ్య అమెరికా పాత్రను చక్కగా వివరించేవారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలకు నాయకత్వం వహించే నాయకులకు, కార్యకర్తలకు ఆయన తోడుగా ఉండేవారు. ఆ క్రమంలో రామచంద్రారెడ్డి ఒపిడిఆర్, డిఎస్‌ఒ లాంటి వామపక్ష సంస్థల కార్యక్రమాలకు హాజరయ్యేవారు. వయసు పైబడినా ఆయన ప్రసంగాలు ఉద్వేగపూరితంగా, ప్రేరణాత్మకంగా ఉండేవి. ఎన్నో పుస్తకాలు చదివిన ఆయన మేధస్సు వాటిలో ప్రస్ఫుటించేది. తాను పాల్గొన్న ప్రతి సభలోను పేదరికం, నిరుద్యోగం, విద్య, వైద్యం లాంటి మౌలిక సమస్యల గురించి ప్రస్తావిస్తూ సంఘటిత ఉద్యమాల నిర్మాణమే దీనికి పరిష్కారం అని ఘంటాపథంగా చెప్పేవారు. పాతతరం రాజకీయాలకు ప్రతినిధిగా, కొత్త తరానికి రాజకీయ గురువుగా ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శనీయం. పదవులకు పర్యాయపదం సామాజిక సేవనే అని తన జీవన గమనం ద్వారా నిరూపించారు. భిన్న ఆలోచనా విధానాలను జనం అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి తెచ్చిన అరుదైన నేత ’సోలిపేట’.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News