Monday, December 23, 2024

రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : రైతుల పంటల వివరాలను 15 రోజులలో సేకరించి ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో రైతుబంధు, రైతు బీమా, పంట వివరాలు క్షేత్రస్థాయిలో సేకరించి నమోదు చేసి ఎరువులు, విత్తనాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు 10 వేల 7 ఎకరాలలో వరి నాట్లు అయ్యాయని, లక్షా 78 వేల 607 ఎకరాలు వరి నాట్లకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

లక్షా 127 ఎకరాలలో పత్తి పంట వేయడం జరిగిందని, అలాగే కందులు 180 ఎకరాలలో వేశారని, మిగతా పంటలన్ని కలిపి 8వేల ఎకరాలలో వేయడం జరిగిందని అన్నారు. పంటల పూర్తి వివరాలను 15 రోజుల లోపు ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎరువులపై మాట్లాడుతూ, జులై మాసం చివరి వరకు జిల్లాలో 16,947 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 16, 397 మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని, క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఎరువుల పంపిణీ సక్రమంగా జరపాలని ఆదేశించారు.

రైతుబంధుపై సమీక్షిస్తూ, జిల్లాలో 2 లక్షల 66 వేల 881 పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని, 18,611 పాస్ పుస్తకాలు పెండింగులో ఉన్నాయని, వీటిని ఈ నెల ఏడవ తేదీలోగా డాటా తీసుకొని రైతుబంధు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రైతు బీమాపై మాట్లాడుతూ జిల్లాలో 20 కేసులు పెండింగులో ఉన్నాయని, వీటికి సంబంధించిన పత్రాలతో రెండు రోజుల్లోపు అప్లోడ్ పూర్తి చేయాలని తెలిపారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ అధికారులు మండల వ్యవసాయ అధికారులు ఏఈవోలు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News