జగిత్యాల: సాగు భూమి లేక యేళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు సిఎం కెసిఆర్ పోడు పట్టాలను అందించి వారి కల నేరవేర్చారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో నిర్వహించిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని 15 మంది రైతులకు 19.28 ఎకరాల భూమికి సంబంధించి పోడు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ యేళ్లుగా అటవీ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఇతర కులాలకు చెందిన వారికి ఆ భూములపై హక్కులు కల్పించేందుకు సిఎం కెసిఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించి పకడ్భందీ సర్వే చేయించి అర్హులైన రైతులను గుర్తించేలా అధికారులను ఆదేశించారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా పోడు భూములను గుర్తించి వాటిని సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్‌కు గిరిజనుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి అన్నారు. పోడు పట్టాల పంపిణీతో అటవీ భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతులందరికీ లాభం జరిగిందన్నారు. పోడు పట్టాలతో రైతులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయని, రైతు బంధు, రైతు బీమాతో పాటు ప్రభుత్వ పక్షాన అందించే పథకాలన్నీ అందుతాయన్నారు.
అలాగే ఆ భూమిపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే వీలుంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4556 ఎకరాల పోడు భూమిని గుర్తించామని, అర్హులైన వారందరికీ పట్టాలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు తప్పిపోయినట్లయితే మరోసారి సర్వే నిర్వహించి వారందరికీ పట్టాలందించేందుకు కృషి చేస్తామన్నారు. 50 యేళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు పోడు పట్టాలపై విమర్శలు చేయడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు.
30,40 యేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, గిరిజనుల ఇబ్బందులను తొలగించి వారికి పట్టా అందించే ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వారికే చెల్లిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే సిఎం కెసిఆర్ పోడు పట్టాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను అర్దం చేసుకుని పరిష్కరిస్తున్న సిఎం కెసిఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని గిరిజనులు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, జగిత్యాల, కోరుట్ల ఎంఎల్‌ఎలు డాక్టర్ సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, అధికారులు, లభ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.