హైదరాబాద్ : బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనలో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల ప్రజలపై 50 శాతం అఘాయిత్యాల సంఘటనలు పెరిగాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనరసింహ ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం దళితులు ప్రతిరోజూ ప్రతి 12 నిమిషాలకు ఒక అఘాయిత్యానికి, దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని అయన తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలపై నేరాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం సమితి అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎం..బాలనరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన అమూల్యమైన భారత రాజ్యాంగాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ద్వంసం చేస్తూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులను, సామాజిక భద్రతను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మతతత్వ జాతీయవాదం, బ్రాహ్మణ వైదిక సంప్రదాయం దేశానికి ప్రమాదకరం అని, ముఖ్యంగా దళిత గిరిజనులకు అత్యంత ప్రమాదకరం అని అయన ఆందోళన వ్యక్తం చేసారు. బిజెపి మతతత్వ జాతీయవాదాన్ని, బ్రాహ్మణ వైదిక సంప్రదాయన్నీ తిప్పికొడుతూ, దళితులపై పెరుగుతున్నఅణచివేత, నేరాలపై తీవ్రంగా ప్రతిఘటించాలని అయన పిలుపు నిచ్చారు. ఎల్‌పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్న ప్రధాని మోడీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా కేవలం జాతి సంపదలైన ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటూ ఉద్యోగ భద్రత మరియు ఉద్యోగ కల్పనా లేకుండా చేస్తూ ఆఖరుకు దళిత గిరిజనులకు రేజర్వేషన్లను కూడా లేకుండా చేస్తున్నాడని అయన మండిపడ్డారు. బిజెపి నేతృత్వంలోని ప్రధాని మోడీ నిరంకుశ పాలన, రాజ్యాంగ, ప్రజాస్వామ్య, ప్రజావ్యతరేక విధానాలను అణచివేయబడిన దళిత, ఆదివాసీ శక్తులే ప్రతిఘటించ వలసిన అవసరముందని, బలమైన ఉద్యమాల ద్వారా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులను అంతం చేయాలనీ కోరారు.
తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మరుపాక మాట్లాడుతూ పేద దళితుల సాధికారతకు ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం ఎంఎల్‌ఎల ద్వారా కాకుండా జిల్లా కలెక్టర్ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి పంపిణి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. మొదటి విడుత దళిత బంధు పంపిణీలో అనేక అక్రమాలు జరిగాయని అయన ఆరోపించారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన దళితులకు దళిత బంధు ఇవ్వాలని అలాగే దరఖాస్తు చేసుకున్నప్రతి దళితునికి గృహ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ జులై 10న అన్ని జిల్లాల కలెక్టర్‌లకు వినతి పత్రాలు ఇచ్చి, జులై 31న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించేందుకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుందని అనిల్ కుమార్ మరుపాక వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.యేసు రత్నం, బి.లక్ష్మీపతి, ఆరుట్ల రాజ్ కుమార్, జేరిపోతుల కుమార్, ఉషశ్రీ, కే సహదేవ్, డి రాములు, కే వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు