‘దేశభక్తి మన చివరి ఆధ్యాత్మిక మజిలీ కాకూడదు. నేను వజ్రాల ధరనిచ్చి గాజు పూసలు కొనుక్కోను. నా జీవిత కాలంలో ఎన్నడూ దేశభక్తి మానవత్వాన్ని అధిగమించనీయను” విశ్వకవి రవీంద్ర నాథ్ టాగూర్ 2002లో గుజరాత్‌లో జరిగిన మారణ హోమానికి ప్రతిస్పందనగా మార్చి 2003లో ANHAD (Act Now for Hormony and Democracy) పేరుతో ఒక NGO సంస్థ రూపు దిద్దుకుంది. ఆ సంస్థ ఇరవై యేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా అన్‌హద్ కార్యక్రమాల్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సి వుంది. అలాంటి ఎన్‌జిఒల అవసరం నేడు దేశంలో ఎంతగా వుందో ఆలోచించుకోవాల్సి వుంది.
దేశంలో నాశనమవుతున్న మానవ హక్కులు, అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం, బద్దలవుతున్న సామాజిక న్యాయం, బీటలు బారుతున్న సుహృద్భావం కొంత మంది సామాజిక కార్యకర్తల్ని, మార్కిస్టు మేధావుల్ని స్థిమితంగా కూర్చోనీయలేదు. వారు సత్వరమే ‘అన్‌హద్’కు రూపకల్పన చేసి, కార్యరంగంలోకి దూకారు. సామాజిక కార్యకర్త షబ్మయ్ హాష్మి, ఆమె సోదరుడు సఫ్‌దర్ హాష్మి, మార్కిస్టు చరిత్రకారుడు ప్రొఫెసర్ కె.ఎన్.ఫణిక్కర్, సామాజిక కార్యకర్త హర్ష్‌మందర్ ప్రభృతులంతా కలిసి ఢిల్లీలో ‘అన్‌హద్’ను ప్రారంభించారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, ప్రజల మధ్య సుహృద్భావం వంటివి పరిరక్షిస్తూ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పాలన్న మహదాశయంతో అన్‌హద్ ఎన్‌జిఒ ప్రారంభమైంది. ‘అన్‌హద్’ అంటే హద్దులు లేనిది. కుల మతాల మధ్య, ప్రాంతాల మధ్య ద్వేషాన్ని నింపి, మనిషిని మనిషితో కలవకుండా చేస్తున్న వారి ఆటలు కట్టించడానికి అన్‌హద్ ఏర్పడింది.
‘మత తత్వాన్ని మట్టుబెట్టే పని ముస్లింలది, సిక్కులది, క్రైస్తవులది, హిందువులది అంతేకాదు, భారతీయులందరిదీ! దీని కోసం వారంతా మత తత్త దృక్పథాన్ని అధిగమించి నిజమైన జాతీయవాద మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి!!” అని అన్నారు సుభాస్ చంద్రబోస్. మనిషి మనిషిని బతికించుకోవాలని, మనిషి మనిషిని గౌరవించుకోవాలని, మనిషి మనిషిని ప్రేమించాలని, మనిషే కేంద్రంగా జరుగుతూ వస్తున్న అన్ని కార్యక్రమాలనూ ప్రోత్సహించాలని అన్‌హద్ సంస్థ నిర్వాహకులు దృఢ నిశ్చయంతో ముందుకు నడిచారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన, పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం ఒకటుంది. కేవలం నిజాయితీ, నిబద్ధతల మీద నడుస్తున్న ఈ ఎన్‌జిఒకు ఏ ఆర్థిన వనరులూ లేవు. చెప్పుకోదగ్గ నెట్‌వర్కూ లేదు. అయినా, అది శక్తికి మించి దేశ పౌరులకు స్ఫూర్తినందిస్తూ వుంది. నాటక కర్త సఫ్‌దర్ హాష్మి, అన్‌హద్ కంటే ముందు ‘సహెమత్’ SAHEMAT అనే సంస్థను రూపొందించారు.
ఆ అనుభవం ఇక్కడ పని కొచ్చింది. సహెమత్ అంటే అంగీకరించడం. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి ప్రజలకు వివరించడం ‘అన్‌హద్’ ఉద్దేశం. ముఖ్యంగా గుజరాత్‌లోనూ, కశ్మీర్‌లోనూ మతతత్వవాదుల దాడుల్ని ఎదుర్కోవడం, వారిని ధైర్యంగా చట్టానికి అప్పగించడం ఈ సంస్థ సాధించిన విజయాలలో ముఖ్యమైంది. అన్‌హద్ ఆలోచనల్ని, ఆశయాల్ని జనంలోకి విరివిగా తీసుకుపోవడానికి పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించడం జరిగింది. “దురాగతాలను బహిర్గతం చేస్తూ, ఉన్నత నైతిక భావాలను వ్యాప్తి చేయడం కంటే మిన్న అయిన లక్షమూ ప్రయోజనమూ సాహిత్యానికి మరొకటి లేదు” అని మన తెలుగు మహాకవి గురజాడ అప్పారావు అన్నారు కదా? అన్‌హద్ సభ్యులు గ్రూపులుగా ఏర్పడి, జనంలో తిరుగతూ ప్రజలకు మానవ హక్కుల గూర్చి, రాజ్యాంగంలోని కీలక అంశాల గూర్చి, మానవీయ విలువల గూర్చి విరివిగా ప్రచారం చేయడం జరిగింది. ఇంకా జరుగుతూనే వుంది. అన్‌హద్‌లో భాగస్వాములు కావడం ఈ దేశ పౌరులందరి బాధ్యత!
ఇంత వరకు జరిగిన, జరుగుతున్న పరిశోధనలన్నీ మనుషులు చేసినవే. మానవ శ్రేయస్సు కోసం చేసినవే తప్ప, ఏ అతీత శక్తి మహిమా కాదు. స్వార్థ చింతనతో అబద్ధాలు ప్రచారం చేసి, అధికార పీఠం దక్కించుకొని, మారణ హోమాలు సృష్టిస్తున్న వారు మన కళ్ళ ముందే వున్నారు. భ్రమల్లో బతకకుండా వాస్తవాల్ని గ్రహిస్తూ కుట్రదారుల మోసాల్ని తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజలే ఐకమత్యంతో పరిపాలకుల మీద ఒత్తిడి పెంచాలి. అందరికీ అవకాశాలు, అందరికీ న్యాయం, సమంగా అందే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాల హద్దుల్ని చెరిపేసి, మనుషులంతా ఒక్కటే అనే ఆలోచనలోకి రావాల్సి వుంది.
‘అన్‌హద్’ ఎన్‌జిఒను ఒక ట్రస్టుగా రిజిస్టర్ చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోని కన్నింగ్ లేన్‌లో వుంది. మొదట ఆరుగురు ట్రస్టీ సభ్యులుగా వున్నారు. వారు షబ్మమ్ హాష్మి, అబన్ రాజా, అమృతా నాండి, హర్ష్ మందర్, శుభా మీనన్, ముఖ్తార్ షేక్! ఆ తర్వాత కాలంలో ప్రొఫెసర్ కె.ఎన్. ఫణిక్కర్, ప్రొఫెసర్ రామ్ పున్యాని, శోభా ముద్గల్ (సంగీతకారిణి) కమలా భాసిన్ (స్త్రీవాద కవయిత్రి), సయీద్ అఖ్తర్ మిర్జా (రచయిత చిత్ర దర్శకుడు) ధృవ్ సంగం ( గాయకుడు సంగీతకారుడు), మొదలైన ప్రముఖులంతా గత పదహారేళ్ళుగా ఆ ట్రస్ట్‌లో వున్నారు.
2002 గుజరాత్ మారణ హోమానికి బలి అయి, నిరాశ్రయులైన బాల బాలికల్ని అన్‌హద్ సంరక్షించింది. గుజరాత్ అల్లర్లపై వచ్చిన ‘పర్జానియా’ వంటి చలన చిత్రాలు వారికి చూపించి, వాస్తవాలు అర్థమయ్యేట్టుగా చేసింది. 2010లో ఈ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్మీ సెక్యూరిటీ బలగాలు కశ్మీర్ లోయలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాయని ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల్ని అపహాస్యం చేశాయనీ అపహాస్యమే కాదు కొన్ని చోట్ల అవి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయని అందుకు కారణం ఇప్పటి కేంద్ర ప్రభుత్వమేననీ అన్‌హద్ నిర్భయంగా చెప్పగలిగింది. అలాగే బట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసు గురించి దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులను అన్‌హద్ డిమాండ్ చేసింది. 2009లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఈ ఎన్‌జిఒ సంస్థ దృష్టి సారించింది. ఆ విషయాన్ని దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయడానికి ‘రిజర్వేషన్ ఎక్స్‌ప్రెస్’ అనే కార్యక్రమం రూపొందించుకొన్నది.
దేశంలో దుష్ట పాలనకు మూల కారణమైన ఆర్‌ఎస్‌ఎస్‌ను వెంటనే నిషేధించాలని అన్‌హద్ 24 మార్చి 2012న డిమాండ్ చేసింది. దేశంలో ముస్లింల అస్తిత్వాన్ని విశ్లేషించడానికి జాతీయ సమావేశాలు నిర్వహించింది. (2010 2012) ఉగ్రవాదం పేరుతో అన్యాయంగా మైనారిటీల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని నిరసిస్తూ 2010లోను, 2012 లోనూ కార్యక్రమాలు చేపట్టింది. ధులే అల్లర్ల మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి, మానవ హక్కుల పరిరక్షణకు సమాజిక న్యాయ స్థాపనకు పోరాడింది. అన్‌హద్ చేపట్టిన కార్యక్రమాలలో ఇవి కొన్ని మాత్రమే దేశంలో ప్రభుత్వపరంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అన్‌హద్ ఎండగడుతూనే వచ్చింది. నిరంతరం తన పోరాటం కొనసాగిస్తూనే వుంది. స్వర్గమంటే ఎక్కడో లేదు. దాన్ని ఈ ధరాతలం మీద మనమంతా కలిసి నిర్మించుకోవాల్సి వుందన్న మాటను వాస్తవంలోకి తేవడానికి దేశ పౌరులంతా కంకణబద్దులవ్వాలి.
దేశ పౌరుల్ని అంధ విశ్వాసాల్లో ముంచేయడానికి నేటి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. ‘భారత్ గౌరవ్’ పేరుతో ఉత్తర భారత దేశంలో ఒక రైలు నడుపుతోంది. అది అక్కడి పుణ్య క్షేత్రాలన్నింటినీ చుట్టుకొని వస్తుంది. అంటే దేశ పౌరులు దైవ భావనలోంచి బయటపడి ఎక్కడ వైజ్ఞానికతను అందిపుచ్చుకుంటారోనన్నది ప్రభుత్వాధినేతల భయం. అలాంటిదే ‘గర్భ సంస్కార్’ ఒకటైతే, పాఠశాలలో భగవద్గీతను బోధించడం మరొకటి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ సమవర్ధనీ న్యాస్ ‘గర్భ సంస్కార్’ కార్యక్రమం రూపొందించింది. గర్భంలో వున్నప్పుడే శిశువుకు భారతీయ విలువలు, సంస్కృతి నేర్పించాలని అందుకు గర్భిణీ స్త్రీల సహకారం తీసుకోవాలని సమవర్ధనీ న్యాస్ డాక్టర్లను కోరింది. పద్మ వ్యూహం ఎలా ఛేదించాలో అభిమన్యుడు గర్భంలో వుండగానే నేర్చుకొన్నాడనీ, 17వ శతాబ్దంలో శివాజీ గర్భంలో వుండగానే తల్లి జిజియా బాయి చెప్పిన విషయాలు నేర్చుకొన్నాడనీ… సమవర్ధనీ న్యాస్ జాతీయ కార్యదర్శి ప్రకటించారు. ‘మనుశాస్త్రం’ భారత ప్రాచీన రాజ్యాంగం అని ఇటీవల కొందరు ప్రకటించారు. పురాణానికి, రాజ్యాంగానికి తేడా తెలుసుకోలేని మందబద్ధులు అంతకన్నా ఇంకేం చేయగలరూ? ఆ ప్రాచీన రాజ్యాంగం కావాలనుకునేవారు వెళ్ళగలిగితే ఆ ప్రాచీన యుగానికే వెళ్ళి బతకాలి. ఈ అత్యాధునిక వైజ్ఞానిక యుగంలో వారికి పనేమిటీ? ఇక్కడ వారికి ఏ ం అర్థమవుతుంది గనుక? “దేశం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది” అని అన్నారు సినీ నటుడు కమల్ హాసన్.
“నరేంద్ర మోడీ, అమిత్ షాలతో కలిసి ఈ దేశ ప్రజలనందరినీ నేను ఘోరంగా మోసం చేశాను. బిజెపి చేసిన స్కాంలలో నాది కూడా సమానమైన భాగస్వామ్యం వుంది. ఈ అపరాధ భావంతో నేను చచ్చిపో దలుచుకోలేదు. అందుకే నన్ను క్షమించమని భారతీయులందరినీ వేడుకొంటున్నాను” అని చనిపోవడానికి ముందు రామ్ జత్మలాని (14 సెప్టెంబర్ 1923 8 సెప్టెంబర్ 2019) ప్రకటించాడు. ఆ ప్రకటన పత్రికలు అచ్చేశాయి. ఆయన మాట్లాడిన వీడియో కూడా దేశ ప్రజలకు అందింది. రామ్ జత్మలాని సుప్రీంకోర్టు లాయరు, బార్ కౌన్సిల్ చైర్మన్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంతే కాదు, రాజకీయవేత్త, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి. దీని వల్ల ఏం తెలుస్తోంది అంటే నిజాలు దాగవు! అని డిస్కవరీ సైన్స్ వంటి టెలివిజన్ ఛానల్ కార్యక్రమాలు ఒక్క పది నిమిషాలు శ్రద్ధగా గమనిస్తే చాలు, మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఎంత సాధించాడు? అనేది అర్థమవుతుంది.
కానీ, మన ప్రభుత్వాలు విచక్షణా జ్ఞానాన్ని కప్పి పెట్టే విధంగా రైతులు ఆవు ఆధారిత వ్యవసాయం చేయాలని ప్రకటిస్తాయి. ఆవు మూత్రం, ఆవు పేడ ప్రదర్శిస్తూ ప్రజల్ని వెనక్కి అనాగరిక సమాజంలోకి నెట్టేస్తాయి. ప్రభుత్వాలు చేస్తున్న అనైతిక దోపిడీని ఎవరూ ప్రశ్నించగూడదని ప్రభుత్వ పెద్దలు కోరుకొంటున్నారు. కానీ, అది ఎల్లకాలం సాగుతుందా? రైతు చట్టాల్ని ప్రజలు ఎలా తిప్పికొట్టారో గత సంవత్సరం చూశాం కదా? అదే స్ఫూర్తిని తీసుకొని ప్రజలు ఇతర విషయాలలో కూడా వివేకవంతంగా ఎందుకు స్పందించరూ? వారికి కావాల్సిందేదో వారు ఎందుకు సాధించుకోరూ? ‘అన్‌హద్’ లాంటి ఎన్‌జిఒలు ప్రజలకు అండగా వుంటూనే వున్నాయి.
నిత్య జీవితంలోని ఒక విషయం పరిశీలిద్దాం! చిన్న పిల్లల కల్పితాలకు, ఊహలకు అంతే వుండదు. వాళ్ళు పులి తొడుగులు వేసుకొని, పులిలాగా అరుస్తూ, ఇంట్లో వాళ్ళను, చుట్టూ వున్న సన్నిహితులను భయపెడుతుంటారు. ఆ మరునాడే స్పైడర్ మ్యాన్ ముసుగు వేసుకొని అంతెత్తున గాలిలో ఎగిరిపోతున్నట్టు ఊహించుకొంటారు. ఈ పిల్ల చేష్టలను చూసి పెద్దవారెవరైనా, ఎప్పుడైనా భయపడతారా? లేదు అలా ఎన్నడూ జరగదు! ఇప్పుడు పెద్ద వాళ్ళే రకరకాల ముసుగులు వేసుకొని వీధుల్లోకి వచ్చి అరుస్తూ హిందుత్వ పేరుతో కేకలేస్తున్నారు. ఈ దేశ ప్రజలేమైనా భయపడుతున్నారా? లేదే? వారి పిల్ల చేష్టలను చూసి జాలి పడుతున్నారు. వారి ఎదుగుదలను కాంక్షిస్తున్నారు. వారి పిచ్చి ఇంకా ముదిరితే దేశ వ్యాప్తంగా ‘షహీన్ బాగ్’లు వెలుస్తాయి. ‘అన్‌హద్’ ఎన్‌జివోలు పుట్టుకొస్తాయి. హద్దులు గీసే వారినే హద్దుల్లో పెడతాయి!!
డా. దేవరాజు మహారాజు