Monday, November 25, 2024

కమలంలో కాంగ్రెస్ లక్షణాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : క్రమశిక్షణకు మారుపేరుగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీ(బిజెపి) ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోందనే విమర్శలు, ఆరోపణలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇటీవల జరిగిన, జరుగుతున్న పరిణామాలతో పార్టీ ప్రతిష్టకు తీవ్రస్థాయిలో భంగం వాటిల్లిందని ద్వితీయశ్రేణి నాయకులే కాకుండా ఎంఎల్‌ఎ, ఎంపి పదవులకు పోటీ పడుతున్న నాయకులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై వేటు వేయడం, కొత్తగా మళ్లీ జి.కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా చేయడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలు పార్టీ ప్రతిష్టకే కాకుండా పార్టీ కేడర్‌ను తీవ్ర నిరాశ, నిస్ప్రుహలకు గురిచేసిందనే విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ గడచిన మూడేళ్ళల్లో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీని అధికారంలోకి తెస్తున్నట్లుగా ఉందనే భ్రమల వరకూ తీసుకొచ్చాడని, కానీ గత తొమ్మిది నెలలుగా పార్టీలో అంతర్గతంగా జరిగిన కుమ్ములాటలు, ఆరోపణలు, విమర్శలు ఒక్కసారిగా పార్టీ ఇమేజ్‌ను పాతాళానికి దిగజార్జాయని పలువురు బిజెపి నాయకులే అంతులేని ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు.

ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ “ఒన్ మ్యాన్ షో” మాదిరిగా పార్టీని నడిపించడంతోనే విసుగు చెందిన పలువురు సీనియర్ నాయకులు, పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు కూడా జీర్ణించుకోలేక పోవడం, అధిష్టానం కూడా పార్టీలో అనేక దశాబ్దాలుగా పనిచేస్తూ వచ్చిన పాతవారికే అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ రావడం, ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి వచ్చిన సీనియర్ నాయకులను సముచితంగా గౌరవించకుండా నిర్లక్షం వహించడం, ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధి “నేనంటే నేనేనని ఒకరికొకరు” మీడియాకు లీకులిచ్చుకొంటూ గ్రూపు రాజకీయాలను పెంచిపోషించింది కూడా బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లేనని, ఈ ముగ్గురూ మూడు గ్రూపులుగా విడిపోయి పార్టీని ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడిపించారని, అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోందని ఆ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎల్‌ఎ రఘునందన్ ఆరోపణలు..
ఇదంతా ఒక ఎత్తయితే సోమవారం దుబ్బాక ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు చేసిన ఆరోపణలు, విమర్శలు దావానలంలా వ్యాపించాయని, మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆయన చేసిన ఆరోపణలు, విమర్శలు తీవ్రస్థాయిలో చెక్కర్లు కొడుతున్నాయి. సాయంత్రానికి మాట మార్చినప్పటికీ జరగకూడని నష్టం జరిగిపోయిందని అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం పుస్తెలతాడు అమ్ముకొన్న బండి సంజయ్ వందల కోట్లకు ఎలా పగడలెత్తాడని, ప్రకటనలకే కోట్లాది రూపాయలను ఖర్చు చేసే స్థాయికి ఎలా ఎదిగాడని రఘునందన్ రావు నిలదీసిన అంశం పార్టీలోనే కాకుండా రాజకీయవర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.

అంతేగాక బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాపైన కూడా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడికే ఫిర్యాదు చేస్తానని కూడా రఘునందన్‌రావు చేసిన హెచ్చరికలు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయనడానికి నిలువెత్తు నిదర్శనమని అంటున్నారు. చేయకూడని ఆరోపణలు, విమర్శలు చేసి కూడా తర్వాత సారీ చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, రఘునందన్ వ్యాఖ్యలు పార్టీకి కోలుకోలేనంతటి డ్యామేజీ జరిగిందని ఆ నాయకులు గట్టిగా భావిస్తున్నారు.

బండి ఒంటెత్తు పోకడలే కారణమా?
ఒకవేళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చాలని భావించినట్లయితే కనీసం ఆరు నెలల క్రితమే ఈ పని చేసి ఉన్నట్లయితే పార్టీకి ఇంతటి డ్యామేజీ జరిగి ఉండేదికాదని అంటున్నారు. ఒకవేళ ఎవ్వరికైనా అసంతృప్తులు ఉండివుంటే ఈపాటికి సద్దుమణిగేయని, అందరూ ఎన్నికల సమరంలో మునిగిపోయేవారని అంటున్నారు. అధిష్టానం కొత్త వారి పట్ల ఎలా వ్యవహరించాలి..? అనే అంశంపై పాత వారికి చేసిన హితబోధలు ఒక ఎత్తయితే బండి సంజయ్ వ్యవహారశైలి కూడా కొత్త వారికి ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. అధిష్టానం చేసి న హితబోధలను కొత్తవారికి తెలియనీయకుండా, అం దర్నీ కలుపుకొనిపోతూ వారి సీనియారిటీని, వయస్సును గౌరవిస్తూ (అలా నటిస్తూ)నైనా బండి సంజయ్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఇంతటి ఉపద్రవం సంభవించేది కాదని అంటున్నారు. ఇప్పుడు పా ర్టీలో నెలకొన్న పరిస్థితులు ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు, తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News