Monday, December 23, 2024

1978 నాటి పాపం ఇప్పుడు శరద్ పవార్‌ను వెంటాడుతోంది: రాజ్ థాకరే

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసహ్యం కలిగిస్తున్నాయని, ఓటర్లను అవమానించే రీతిలో ఇవి సాగుతున్నాయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో తిరుగుబాటు రాజకీయాలనే విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌ను అవే తిరుగుబాటు రాజకీయాలు వెంటాడుతున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసహ్యంగా ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఏ ఇంటికి వెళ్లి దీన్ని గురించి అడిగినా తిట్లు ఎదురవుతాయని మంగళవారం పుణెలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్ థాకరే అన్నారు. ఇది ఓటర్లను దారుణంగా అవమానించడమేనని ఆయన చెప్పారు.ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి దాపురించిందని, మహారాష్ట్రలో ఇదో దురదృష్టకర పరిస్థితని ఆయన అన్నారు. అజిత్ పవార్ నాయకత్వంలో 9 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన దరిమిలా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన రాజ్ థాకరే స్పందించారు. ఈ పరిణామాల వెనుక ఎవరున్నారన్నది స్పష్టంగా తెలియడం లేదని ఆయన చెప్పారు. ఇది శరద్ పవార్ ఆడుతున్న ఆటలో భాగమని తర్వాత బయటపడినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 1978లో శరద్ పవారే దీన్ని మొదలు పెట్టారని, అంతకుముందు మహారాష్ట్రలో ఇలాంటిదేదీ జరగలేదని ఆయన చెప్పారు. అప్పుడు ఆయన(శరద్ పవార్) మొదలు పెట్టిందే ఇప్పుడు ఆయనను వెంటాడుతోందని రాజ్ చెప్పారు. 1978లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెను ఎక్కడానికి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ ప్రభుత్వాన్ని శరద్ పవార్ పడగొట్టారు.

ఎన్‌సిపి తిరుగుబాటుదారులలో ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్, ఛగన్ భుజ్‌బల్ వంటి వారు అజిత్ పవార్ వెంట నడిచే వారు కారని, ఈ కారణంగానే ఈ తిరుగుబాటు నాయకుల చర్యలు సందేహాస్పదంగా ఉన్నాయని రాజ్ చెప్పారు. అన్ని హోర్డింగులలో శరద్ పవార్ ఫోటోలు పెడతామని అజిత్ పవార్ చెబుతున్నారని, ఇది కూడా అనుమానించడానికి ఒక కారణమని ఆయన అన్నారు. భవిష్యత్తులో శరద్ పవార్ కుమార్తె, ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News