ముంబై: ఎన్‌సిపి అధినేత, తన బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు ఎమ్మెల్యే, ప్రస్తుత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వయసు మీదపడిన శరద్ పవార్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగలేరని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. కొద్ది నెలల క్రితం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్ మనసు మార్చుకోవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
మీకు ఇప్పటికే 82, 53 ఏళ్లొచ్చాయి. బిజెపి నాయకులు 75వ ఏట రిటైర్ అవుతున్నారు. మీరు వందేళ్లు జీవించాలి. కాని ఎక్కడో ఒకచోట ఆగక తప్పదు. మీరు మా దైవం..మీకు ఆశీస్సులు ఇవ్వండి చాలు అంటూ అజిత్ పవార్ శరద్ పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది. 25 నుంచి 75 ఏళ్ల వయసులోనే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని 63 ఏళ్ల అజిత్ పవార్ చెప్పారు. మాకు మీరే దేవుడు..మీరంటే మాకు ఎనలేని గౌరవం ఉంది అంటూ శరద్ పవార్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. ఐఎఎస్ ఆఫీసర్లు 60 ఏళ్లకే రిటైర్ అవుతారు. రాజకీయాలలో బిజెపి నాయకులు సైతం 75 ఏళ్లకే రిటైర్ అవుతారు. ఈ విషయంలో ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలే ఉదాహరణ. మీకు 83 ఏళ్లు. ఇక మీరు రిటైర్ కారా..మీ ఆశీస్సులు ఇవ్వండి చాలు..మీరు వందేళ్లు జీవించాలని ప్రార్థిస్తాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రాజీనామా వెనక్కు తీసుకోవాలని భావించినపుడు అసలు ఎందుకు రాజీనామా చేశారు. ఇదే విషయం ఆయనకు వివరించమని నా చెల్లెలు సుప్రియా సూలెకు కూడా చెప్పాను..కాని ఆయన మాత్రం మొండి పట్టుదలగా ఉన్నారు అంటూ శరద్ పవార్‌ను ఉద్దేశించి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపికి ఎన్‌సిపి ఎందుకు మద్దతు ఇచ్చింది అని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న తన ఆకాంక్షను కూడా అజిత్ పవార్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.