భోపాల్ : ఆదివాసి యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీస్‌లు రంగం లోకి దిగి బుధవారం తెల్లవారు జామున నిందితుడిని అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ లోని సీధీ జిల్లాలో మూడు నెలల కిందట ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇలా జరగడానికి కారణమేంటో తెలియదు.
ఇటీవల ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం నెలకొంది. దీనిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిందితుడిని అరెస్టు చేసి జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమం లోనే పోలీస్‌లు నిందితుడు ప్రవేశ్ శుక్లాగా గుర్తించారు.అప్పటికే పరారీలో ఉన్న శుక్లాను సాంకేతికత సాయంతో ట్రాక్ చేసి మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేయగలిగారు. జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శుక్లాకు బీజేపీతో సంబంధం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీన్నీ బీజేపీ ఖండించింది.
ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం మాయవతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కేవలం జాతీయ భద్రతా చట్టం ప్రయోగిస్తే సరిపోదని, అతడి ఆస్తులను జప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేదా బుల్డోజర్ తీసుకువచ్చి కూల్చేయాలని అన్నారు.