హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. జులై 8వ తేదీ ఉదయం 10:45 గంటలకు, ప్రధానమంత్రి వరంగల్ జిల్లాకు చేరుకుని, దాదాపు రూ.6,100 కోట్ల విలువైన పలు కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రూ.5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు పునాది వేస్తారు. నాగపూర్,- విజయవాడ కారిడార్ కింద 108 కిలోమీటర్ల మంచిర్యాల- వరంగల్ సెక్షన్ కూడా ఒకటిగా ఉంది. దీంతో మంచిర్యాల, -వరంగల్ మధ్య దూరం దాదాపు 34 కిలోమీటర్లు తగ్గడమేగాక ప్రయాణ సమయం కూడా ఆదా కావడంతో సహా జాతీయ రహదారి 44, 65లలో వాహన రద్దీ తగ్గుతుంది.
జాతీయ రహదారి పరిధిలో 68 కిలోమీటర్ల కరీంనగర్- వరంగల్ సెక్షన్‌ను రెండు నుంచి నాలుగు వరుసలుగా ఆధునీకరించే పనులకూ ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్‌లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల అనుసంధానానికి ఇది తోడ్పడుతుంది. కాజీపేటలో రూ.500 కోట్లతో గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కర్మాగారం నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అత్యాధునిక కర్మాగారం వ్యాగన్ తయారీ సామర్థ్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ఇది ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో పాటు వ్యాగన్లకు రంగువేసే రోబోటిక్ యంత్రాలు, అత్యధునాతన యంత్ర సామగ్రితో పాటు ఆధునిక సామాగ్రి నిల్వ-నిర్వహణ తదితర సౌకర్యాలతో ఏర్పాటు చేయబడుతుంది. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సమీప ప్రాంతాల్లో అనుబంధ యూనిట్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.