హైదరాబాద్: ఎందుకు ఏమిటనే కారణాలు తెలియలేదు కానీ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం నాటి కేంద్ర మంత్రి మండలి సమావేశానికి వెళ్లలేదు. ఒక్కరోజు క్రితమే కిషన్‌రెడ్డి మంత్రిపదవి బాధ్యతల్లో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి నియామకం జరిగింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక , ఈశాన్య ప్రాంత వ్యవహారాల మంత్రి అయిన కిషన్ రెడ్డి ఇప్పటి కేబినెట్ భేటీకి హాజరు కాక పోవడంపై ఎటువంటి అధికారిక వివరణ లేదా ప్రకటన వెలువడలేదు. అయితే త్వరలోనే కేబినెట్‌లో పెద్ద ఎత్తున జరిగే ప్రక్షాళన క్రమంలో తన వంతు కూడా ఉంటుందని, తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించిన దశలో మంత్రిపదవిలో ఉండటం సరికాదని భావించే ఆయన కేబినెట్‌కు వెళ్లలేదని భావిస్తున్నారు.
బిజెపిలో సాధారణంగా ఒక వ్యక్తికి ఒక పదవి ఆచారం ఉంది. అయితే కిషన్ రెడ్డి జోడుపదవుల్లో ఉంటారా? మంత్రిపదవి వీడుతారా? అనే విషయంపై ఆయన సన్నిహితులు కానీ, కిషన్ రెడ్డి కానీ కిమ్మనలేదు. ఈ ప్రశ్నలపై కిషన్ రెడ్డి చిరునవ్వులతో సమాధానాలు ఇవ్వకుండా దాటేశారు. పార్టీలో ఆయన కార్యకర్త స్థాయి నుంచి పనిచేశారని, దశాబ్దాలుగా వివిధ స్థాయిల్లో వ్యవహరించారని అధినాయకత్వం అప్పగించే ఏ బాధ్యతను అయినా ఆయన స్వీకరిస్తారని హైదరాబాద్‌లో ఆయన సన్నిహితులు కొందరు తెలిపారు. త్వరలోనే ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున ప్రక్షాళిస్తారని, కొందరు మంత్రులను పార్టీ బాధ్యతలకు పంపించడం, పార్టీ బాధ్యతల్లోని వారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి చర్యలు తీసుకుంటారని వెల్లడైంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డికి తెలంగాణ బిజెపి బాధ్యతలు కట్టబెట్టినట్లు తనకు నిర్థారణ కావడంతోనే కిషన్ రెడ్డి కేబినెట్‌కు వెళ్లలేదని భావిస్తున్నారు.