ముంబై: ఎన్‌సిపి తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంపై శివసేనలో ఎవరూ అసంతృప్తిగా లేరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం ప్రకటించారు. అజిత్ పవార్, మరో 8 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంతో ముఖ్యమంత్రి పీఠం సంక్షోభంలో పడినట్లు ప్రతిపక్షాలు వదంతులు పుట్టిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్‌సిపి వర్గం మంత్రివర్గంలో చేరడంతో కలతచెందిన శివసేన ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యమంత్రి వద్ద తమ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం షిందే అధ్యక్షతన శివసేన ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు, ఎంపీలు సమావేశమై ఇదే విషయమై చర్చించారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఉందంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలతో ఎన్‌సిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి స్పీకర్‌కు ఇచ్చిన పిటిషన్‌పై తీర్పు కోసం శివసేన ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా..షిండే రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను ఆయన గ్రూపునకు చెందిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ ఖండించారు.