Saturday, December 21, 2024

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసనీ, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతామని, దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, గుజరాత్‌లో ఎలా ఏర్పాటు చేస్తుందో తెలంగాణ బిజెపి నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని తప్పుదోవపట్టించి, కేవలం పీఓహెచ్ వర్క్‌షాపు అని, ఆ తర్వాత దానిని వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటూ కాజీపేటకు వస్తున్న ప్రధాని మోడీ మోసాన్ని ఓరుగల్లు ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని వినోద్‌కుమార్ హెచ్చరించారు. ఈనెల 8న కాజీపేటకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో గురువారం దక్షిణ కొరియా దేశ పర్యటనలో ఉన్న వినోద్ కుమార్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
పివి నరసింహారావు ఎంపిగా గెలిచినప్పుడే..
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు. 1980లోనే పివి నరసింహారావు ఎంపిగా గెలిచిన తర్వాత 1982లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారని, సర్వేలు చేశారని, కాజీపేట చుట్టుపక్కల ప్రాంతాలయిన అయోధ్యాపురం, మడికొండ, రాంపూర్ తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూసేకరణ చేస్తామని చెప్పారని, దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా సంతోషపడ్డారన్నారు. అయితే ఆ సమయంలోనే ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరణించడం, ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధాని కావడం కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్‌లో ఏర్పాటు చేశారని ఆయన వాపోయారు. ఇక అప్పటి నుంచి కాజీపేటకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఒక కలగానే మిగిలిపోతోందని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల నోట్లో కేంద్ర ప్రభుత్వాలు మన్నుకొడుతూనే ఉన్నాయని వినోద్‌కుమార్ ఆరోపించారు.
కోచ్ ఫ్యాక్టరీ సాధించేదాక ఉద్యమిస్తాం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రధాన నినాదంగా ఇక్కడి ప్రజలతో కలిసి ఉద్యమించామని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టంలోనూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పొందుపర్చారన్నారు. కానీ, ఇక్కడి ప్రజల డిమాండ్‌ను పక్కనబెట్టి కేవలం పిఓహెచ్ వర్క్ షాపు ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఇక్కడి ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అంశాన్ని పక్కనబెట్టి మోడీ ప్రభుత్వం తెలంగాణను మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. కాజీపేటలో పీఓహెచ్ వర్క్ షాపు ఏర్పాటుకు పునాదిరాయి వేయడానికి ప్రధాని మోడీ జూలై 8వ తేదీన కాజీపేటకు వస్తున్న ఈ తరుణంలో ప్రాంత ప్రజలు మండిపడుతున్నారని ఆయన పర్యటనను బిఆర్‌ఎస్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కాజీపేటలో పీఓహెచ్ వర్క్ షాపు కాదనీ, ప్రస్తుతం వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామన్నారు. కానీ, కాజీపేటకు కావాల్సింది కోచ్ ఫ్యాక్టరీ మాత్రమేనని, దాంతోనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News