హైదరాబాద్ : ఈ నెల 8 న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై గురువారం వరంగల్ పోలీస్ కమీషనర్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిపి సమీక్షించారు. అడిషనల్ డిజి సంజయ్ కుమార్ జైన్, ఐజి షా నవాజ్ కాసీం, సంప్రీత్ సింగ్‌లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ, ప్రధాని పర్యటనలో ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా రెవిన్యూ, రైల్వే, రోడ్లు భవనాలు తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని, అయితే, సామాన్య ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ప్రధాని పర్యటన రోజు ఒక వేళ భారీ వర్షముంటే తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. బహిరంగ సభకు హాజరయ్యే వారు ఏ మార్గంలో చేరుకోవాలని, ఎక్కడ పార్కింగ్ సౌకర్యం కల్పించామన్న వివరాలను ముందస్తు గానే తెలియచేయాలని చెప్పారు.వరంగల్ లో ప్రధాని దిగే హెలిపాడ్‌తోపాటు వేదిక వద్దకు చేరుకునే మార్గాల్లో ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బ్లూ బుక్‌లోని నియమ, నిబంధనలను అనుసరించి తగు బందోబస్తు ఏర్పాటు చేయాలను తెలియ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాధ్ మాట్లాడుతూ, 8 వ తేదీన ఉదయం ప్రధాని కార్యక్రమాలున్న మామునూర్ , భద్రకాళి ఆలయం, ఆర్ట్‌కళాశాలలలో సీనియర్ పోలీస్ అధికారులను ఇంచార్జిలుగా నియమించి పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాట్లను చేశామని వెల్లడించారు. ఇప్పటికే హన్మకొండ పౌరులకు ట్రాఫిక్, సెక్యూరిటీ ఏర్పాట్లపై అడ్వైజరీలను జారీ చేశామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ నుండి సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.