Friday, December 20, 2024

సమాచార హక్కు చట్టం కమిషనర్ రేసులో ఓయూ విద్యార్థి నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవుల కోసం ఆశావాహుల వేట మొదలైంది. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇటీవలే భర్తీ చేసేందుకు నోటిపికేషన్ రావడంతో దరఖాస్తులు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఈసారి అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. చీఫ్ కమిషనర్‌తో పాటు, మరో ఐదు కమిషనర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 4వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఈ పోస్టుల ఎంపికలో సిఎం కెసిఆర్ పాత్ర కీలకంగా ఉంటుంది. చట్టం ప్రకారం త్రిసభ్య కమిటీకి అధికారం ఉంటుంది. ఈకమిటీలో సిఎం, అసెంబ్లీలో ప్రతిపక్షనేత, సిఎం నియమించిన మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈకమిటీ సమావేశమై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మెజార్టీ అభిప్రాయం ఉన్న వారిని ఎంపిక చేస్తారు. కమిటీ నిర్ణయం మేరకు గవర్నర్ చీప్ కమిషనర్, కమిషనర్ల నియమిస్తారు.

ఈసారి ఏలాగైన పోస్టు దక్కించుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంకు చెందిన విద్యార్థి సంఘం నాయకులు డి. రాజారాం యాదవ్, తంగబాలు, పల్లా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తోట్ల స్వామి ప్రయత్నాలు చేస్తున్నట్లు వారి అనుచరులు పేర్కొంటున్నారు. సిఎం కెసిఆర్ ప్రతి ఎన్నికల్లో ఓయూ విద్యార్థినాయకులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు రెండు పర్యాయాలు బిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన కాలంలో బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, పిడమర్తి రవి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, క్రిశాంక్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, కె. కిషోర్‌గౌడ్ వంటి నాయకులకు పదవులు కట్టబెట్టారు.

దీంతో త్వరలో భర్తీ చేసే సమాచార హక్కు కమిషన్ పోస్టుకు పలువురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. విద్యార్థి సంఘం నాయకుల్లో సీనియర్ నాయకుడు డి. రాజారాం యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్లు బిఆర్‌ఎస్ పార్టీ వర్గాలు అంతర్గత సంబాషణల్లో పేర్కొంటున్నారు. ఆయనతో ఉద్యమంలో పనిచేసి వారందరికి ఏదో ఒక పదవి రావడంతో ఆసారి రాజారాం యాదవ్‌కే ఇచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. గురువారం మూడు నామినేట్ చైర్మన్ల భర్తీ కూడా తెలంగాణ ఉద్యమకారులకే ఇవ్వడంతో సమాచార హక్కు కమిషనర్లలో ఓయూకు చెందిన నాయకులు ఇస్తారని విద్యార్థులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఎన్నికల్లో విద్యార్థి నాయకులది కీలక పాత్ర ఉంటుందని వారికి పదవుల పంపకంలో ప్రాముఖ్యత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా జర్నలిస్టుల నుంచి ఒకరికి కమిషనర్‌గా అవకాశం దొరుకుతుందని… సీనియర్ జర్నలిస్టు సోమగోపాల్, మారుతిసాగర్ పేర్లు వినిపిస్తున్నాయి. స్వచ్చంద సంస్ధల నుంచి జెడి లక్ష్మినారాయణ అనుచరుడు పల్నాటి రాజేందర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈసంస్ధ సిబ్బంది వెల్లడించారు. దీంతో చాలామంది ఉద్యమకారులు ఈసారి పదవి లభిస్తుందని ఆశల పల్లకీలో తేలియాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News