మహారాష్ట్రలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల జరగనుండడంతో ఆయా పార్టీలు విజయం సాధించేందుకు ఎన్నికల వ్యుహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి పొత్తులతో పోరాటం చేసేందుకు నడుం బిగిస్తున్నాయి. అధికారం కోసం సిద్ధాంతాలు పక్కకు పెట్టి జత కట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారే ఒంటరిగా ఎన్నికల పోరులో నిలబడితే బిజెపికి అధికారం దక్కదని పార్టీల మధ్య చిచ్చుపెట్టి తమాషా చేస్తున్నది. మనువాద, మత సంప్రదాయాలనే దేశ సంప్రదాయాలుగా తప్పుడు సూత్రీకరణ సిద్ధాంతంగా మలుచుకున్నది. ఎక్కడైతే సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఫలమైనాయో.. అక్కడ బిజెపి పాగా వేసింది. తన మనువాద ఎజెండాను జాతీయవాదం పేరుతో అమలు చేస్తున్నది. దేశ ప్రజలను హిందూ మతం పేరుతో బ్రెయిన్ వాష్ చేస్తూ లొంగదీసుకుంటున్నది. దళిత, బహుజనులను తమ వైపు తిప్పుకోవడం కోసం కన్‌వీన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తూ అందలం ఎక్కుతున్నది.
భేషజాలకు పోయిన పార్టీలను నయానో, భయానో ఎంఎల్‌ఎలకు బేరం పెట్టడం లొంగకపోతే ఇడిలను, సిబిఐలను ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేయడం ఆనవాయితీగా నడిపిస్తున్న తతంగం రెండవ పర్యాయం గెలిచిన తర్వాత బిజెపియేతర ప్రభుత్వాలను అప్పనంగా కూలగొట్టి, విషయం లేకున్నా విషం కక్కుతున్నది. తెల్లారితే.. పొద్దుకూకినా 2024 ఎన్నికల్లో 300 సీట్లు గెలవాలనే లక్ష్యంతో తొండాటకు దిగింది. ప్రజలు చీదరించిన.. దొడ్డిదారిన తొమ్మిది రాష్ట్రాల్లో అధికారం పొందింది. దర్యాప్తు సంస్థల దాడులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. బలం పెంచుకోవడం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా గతంలో శివసేన చీల్చి అక్కున చేర్చుకున్నట్టుగానే దూరదృష్టితో ఎన్‌సిపిని చీల్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై అవకాశవాదుల రాజకీయ ఎత్తుగడలకు వేదిక అయింది.
ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రత్యేకతలు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపెడుతాయి. మహారాష్ట్ర రాజకీయాలలో విలక్షణ వ్యక్తి బాల్ థాక్రే మరాఠా ప్రజల హక్కుల సాధనకై 1966 లో శివసేన పార్టీ స్థాపించారు. థాక్రే మరాఠాల గొంతుక అంటే అతిశయోక్తి కాదు. ఎమర్జెన్సీ సమయంలో వ్యతిరేకంగా పోరాడిన వారిలో థాక్రే ఒకరు. అటువంటిది జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీతో జతకట్టితే అదే బిజెపి శివసేనను చీల్చి గుర్తులు లేకుండా చేసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించి రెండు దశాబ్దాలకు పైగా తిరుగు లేకుండా చక్రం తిప్పిన శరద్ పవార్‌ను జాతీయ రాజకీయాలలో అత్యంత కీలకమైన దశలో అబ్బాయిగా పేరొందిన అజిత్ పవార్ చేత పార్టీ నుంచి తొలిగించి వేయబడ్డారు. తమకు పార్టీలో పూర్తి స్థాయిలో ఎంఎల్‌ఎల బలం ఉందని, తమదే అసలు సిసలు ఎన్‌సిపి అని ఎన్‌సిపి పేరు, ఎన్నికల చిహ్నం గడియారం తమకే దక్కాలని ఎన్నికల సంఘానికి అజిత్ పవార్ వర్గం లేఖ పంపించింది.
తమ వర్గానికే ఎన్‌సిపిగా గుర్తింపు ఇవ్వాలని కోరడంతో మహారాష్ట్ర రాజకీయాలలో పరిస్థితి తీవ్ర స్థాయికి దారి తీసింది. మహారాష్ట్రలో షిండే వర్గపు శివసేన, బిజెపిల కాంబినేషన్‌లోని ప్రభుత్వంలో అజిత్ పవార్ తొమ్మిది మంది ఎంఎల్‌ఎలతో చేరడం, ఎంఎల్‌ఎలకు మంత్రి పదవులు దక్కడం, తాను ఉప ముఖ్యమంత్రి కావడం తరువాత ఎన్‌సిపిలో తీవ్ర సంక్షోభం చివరికి శరద్ పవార్ ఆత్మక్షోభకు గురైంది. రాజకీయాల్లో కాదేదీ అసాధ్యం అనే విషయాన్ని రుజువు చేస్తూ మహారాష్ట్రలో ఎన్‌సిపి శరద్ పవార్‌ను రెబెల్ వర్గం అధినేత అజిత్ పవార్ పార్టీలో తమకు 40 మందికి పైగా ఎంఎల్‌ఎల మద్దతుతో కూడిన బలం ఉందని తెలిపే అఫిడవిట్లను ఎన్నికల సంఘానికి హుటాహుటిన పంపించింది. ఇంకేముంది షిండేకు దక్కినట్టే ‘గడియారం’ భవిష్యత్ పరిణామాలకు కుట్రదారులు మూల్యం చెల్లించక తప్పదనేది జగద్విదితం. 2004లో మహారాష్ట్రకు ఎన్‌సిపి తరఫున సిఎం వచ్చే అవకాశాన్ని శరద్ పవార్ చేజార్చారని అక్కసు వెళ్లగక్కుతున్నారు.
కాంగ్రెస్ కన్నా ఎస్‌పిపికే ఎక్కువ సంఖ్యా బలం ఉండి శరద్ పవార్ కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్ల ముఖ్యమంత్రి దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేయడం వెనుకాల పదవి దక్కకపోవడానికి బాబాయ్ (శరద్) కారణమని అవకాశం కోసం అజిత్ ప్రవర్తన ఎదిరి చూసినట్టుగా ఉంది.2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశం అంతటా బలం పెంచుకోవాలని కమల దళం ఆరాటపడుతున్నది. అందులో భాగం గా బలం లేని రాష్ట్రాల్లో చీలికలు తెస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రెడ్ కార్పెట్ వేసున్నది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది ఎంఎల్‌ఎలు ఉంటే స్వార్థంతో బిజెపి, షిండే, ఎన్‌సిపి భాగస్వామ్యంతో 175 స్థానాలతో ప్రభుత్వా న్ని నడిపిస్తున్నారు. మహా సంక్షోభానికి ముందే షిండే, బిజెపిలతో చేతుల కలపడానికి ఎన్‌సిపి ఈ పని చేస్తే బాగుంటుందని పార్టీలో అత్యధికులు పవార్‌కు సూచించిన విలువలకు లోబడి ఆయన పట్టించుకోలేడు.
తరువాత దశలో ఏక్‌నాథ్ షిండే ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసి ఏకంగా సిఎం అయ్యారనే భావం నెలకొంది. కానీ ఈ తతంగం వెనుకాల బిజెపి కుట్ర ఉన్న సంగతి మర్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట పడాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టం పదునెక్కాల్సిందే. సోనియా గాంధీ జాతీయత అంశంపై విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని 23 ఏళ్ళ క్రితం స్థాపించి సైద్ధాంతికంగా బిజెపితో చేతులు కలుపలేక కేంద్రంలోని యుపిఎ కూటమిలో భాగస్వామి అయ్యారు. అజిత్ ఎప్పటికైనా మహారాష్ట్రకు సిఎం కావాలనే లక్షం నెరవేరడానికి 2024 ఎన్నికల్లో కలిసి వస్తుందా? బిజెపికి పగ్గాలు చేతులో ఉంటే చాలు ముఖ్యమంత్రి ఎవరున్నా సరే సర్దుకుపోతుంది.
కురువృద్ధుడు రాజకీయ చాణక్యునిగా పేరుగాంచిన శరద్ పవర్ ప్రతీకారంలో రగిలిపోతారా, వయసు మళ్ళినా పులిలా గాండ్రిస్తారా వేచి చూడాలి. కుటిల నీతికి పాల్పడుతున్న చీలిక వర్గానికి సరైన సమయంలో సరైన తీర్పు చెప్పడం ఖాయం. ఫిరాయింపులు, చీలికలను ప్రోత్సహించిన పార్టీలను రద్దు చేసే విషయమై సవరణలు చేపట్టేందుకు రాజ్యాంగ, న్యాయకోవిదులతో చట్టంలో మౌలిక మార్పులు అందుబాటులోకి వస్తేనే రాజకీయ కప్ప గంతులకు అడ్డుకట్ట పడుతుంది.