Monday, December 23, 2024

మోడీ.. విభజన హామీల ప్రస్తావనేది?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విభజన చట్టం హామీల మేరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండగా, తొమ్మిదేళ్ల తర్వాత ఈ రోజు వరంగలో వ్యాగన్ వర్క్‌షాప్‌కు శంఖుస్థాపన చేయడం తెలంగాణ ప్రజలను మోసగించడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మోడీ పర్యటన రానున్న ఎన్నికలలో ఓట్ల కోసమే తప్ప తెలంగాణకు ఉపయోగం లేదని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతున్నదన్నారు. మోడీ పర్యటన సందర్భంగా విభజన చట్టం హామీల గురించి ప్రస్థ్ధావిస్తారని రాష్ట్ర ప్రజలు ఆశించారన్నారు. వరంగల్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేటాయించినప్పటికీ ఆ ఫ్యాక్టరీని తనస్వంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలించుకుపోయి తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ఘనుడు నరేంద్ర మోడి అని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఐటిఐఆర్ ప్రాజెక్టు గురించి మాట మాత్రమైనా ప్రస్తావించలేదన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేయకుండా, కృష్ణాగోదావరి బోర్డును ఏర్పాటు చేసి రాష్ట్రాల మధ్య తగాదాను పెంచారన్నారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటూ గెజిట్ పబ్లికేషన్ చేసిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్తు ఉత్పత్తిపంపిణి, ఆస్తుల పంపిణీకి పరిష్కారం చూపలేదన్నారు.

ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తానన్న నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలేదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి కూలీల పొట్ట కొడుతోంది కేంద్రమేనన్నారు. మోడీ ప్రకటించిన రైతు ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు కార్పొరేట్లకు లాభం చేయడానికే తప్ప శాస్త్రీయత లేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమై 32వేల కోట్లు నష్టపోగా కేంద్రం కక్షపూరితంగా ఎలాంటి సహాయం చేయలేదన్నారు. తక్కువ నష్టం జరిగినా బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధులు కేటాయించారని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన నిధులును వెంటనే విడుదల చేయాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News