ముంబై : తన వయసు పైబడిన కారణంగా క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పుకోవాలంటూ ఎన్‌సిపి తిరుగుబాటు నేత అజిత్ పవార్ సూచించడంపై ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలు తనను అధినేతగా కోరినంతవరకూ తన కర్తవ్యాన్ని కొనసాగిస్తానని శరద్‌పవార్ స్పష్టం చేశారు. 83 ఏళ్ల వయసులో తన బాబాయ్‌కు రిటైర్ కావలసిన సమయమని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్య గురించి అడగ్గా వయసుకు పార్టీ బాధ్యతలకు సంబంధం ఏముందని ప్రశ్నించారు. “ మొరార్జీ దేశాయ్ ఎప్పుడు ప్రధాని అయ్యారో మీకు తెలుసా ? నేను ప్రధానినో, మంత్రినో కావాలని అనుకోవడం లేదు. ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను” అని పవార్ స్పష్టం చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పాయ్ మాటలను గుర్తు చేసుకుంటూ తాను మరీ అంత వయసు పైబడి లేనని , తనకెలాంటి అలసట లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు.
“నన్ను రిటైర్ కావాలని చెప్పడానికి వారెవరు ? నేను ఇప్పటికీ పనిచేస్తున్నాను ” అని ఎదురు జవాబు చెప్పారు. ఇండియా టుడే మరాఠీ డిజిటల్ న్యూస్ ఛానెల్ ముంబై టాక్‌కు ఇచ్చిన ఇంటర్వూలో శరద్ పవార్ మాట్లాడారు. పార్టీ ప్రముఖుల (శరద్‌పవార్‌ను ఉద్దేశిస్తూ ) కుమారుడిని కాదు కాబట్టి తనను పక్కకు తప్పించారని అజిత్ పవార్ కుటుంబం లోని వారసత్వ పోరుపై వ్యాఖ్యానించడాన్ని అడగ్గా ఈ అంశంపై ఎక్కువగా చెప్పబోనని శరద్‌పవార్ బదులిచ్చారు. కుటుంబ పరమైన అంశాలు బయట మాట్లాడడం తనకు నచ్చదన్నారు. అజిత్ మంత్రి పదవి పొందారు. డిప్యూటీ సిఎం కూడా అయ్యారు. కానీ తన కుమార్తె సుప్రియా సులేకు సాధ్యమైనప్పటికీ ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదు అని ఉదహరించారు. కేంద్రంలో ఎన్‌సిపికి మంత్రి పదవి లభించినప్పుడు ఇతరులకే ఇవ్వడమైంది తప్ప సుప్రియా పార్లమెంట్ సభ్యురాలైనప్పటికీ ఇవ్వలేదని గుర్తు చేశారు.
అజిత్ పవార్ మరో ఎనిమిది మంది ఎన్‌సిపి ఎమ్‌ఎల్‌ఎలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని మంత్రివర్గం లో చేరిన వారం రోజుల తరువాత శరద్‌పవార్ పార్టీ పటిష్టత కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. తిరుగుబాటు నేత , రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ నియోజక వర్గమైన నాసిక్ జిల్లా ఏవల నుంచి ఆయన తన పర్యటన శనివారం ప్రారంభించారు.