Sunday, January 19, 2025

రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించేలా మోడీ ప్రసంగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో జరిగిన బిజెపి బహిరంగ సభలో మోడి మాట్లాడిన తీరు రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించినట్లు కనిపించిందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఒక్క మాట మాట్లాడని మోడి ముఖ్యమంత్రి కెసిఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడడం కెసిఆర్ అంటే, బిఅర్‌ఎస్ అంటే ఎందుకో ఆయనకు భయం ఉన్నట్లు కనిపించిందని విమర్శించారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా భారీగా నిధులు ఇచ్చి , హామీలు కురిపించే నరేంద్ర మోడి వరంగల్ సభలో ఒక్క రూపాయి ప్రకటించ లేదని, ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో బిజెపి గెలిచే అవకాశాలు లేనందువల్లే నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రధాని ప్రసంగం ముగించారని పేర్కొన్నారు.

ప్రధాని మోడితో సహా ఢిల్లీ బిజెపి నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారని ధ్వజమెత్తారు. జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కు అని, విభజన చట్టం మేరకే రాష్ట్రానికి జాతీయ రహదారులు వస్తున్నాయని ఆయనన్నారు. ఉద్యోగాల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టి ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మోడి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపిలోనే 200 మంది వరకు నాయకుల వారసులు కేంద్ర ప్రభుత్వంలో, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రాజకీయాల్లో ఉన్నారని వారసత్వ రాజకీయాలపై మాట్లాడే అర్హత మోడికి లేదని వాసుదేవ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని ట్రైలర్లు ట్రైలర్స్ కే పరిమితం అవుతాయి. సినిమాలు మాత్రం విడుదల కావు. బిజెపి ట్రైలర్ కూడా అలాంటిదేనని ఎద్దేవా చేశారు.

విభజన హామీలు నెరవేర్చకుండా మొక్కుబడిగా ఏదో ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే పిఎం మోడి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారన్నారు. విభజన చట్టం హామీలైన బయ్యారం ఉక్కు, గిరిజన యూనివర్సిటీ, ఐటిఐఆర్ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలే దని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై నిండు పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు ఎవరు మరవలేదని తల్లిని చప్పి బిడ్డను వేరు చేశారని, అప్రజాస్వామికంగా తెలంగాణ ఏర్పాటు అని,తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని మాట్లాడిన మాటలు ఇంక ప్రజలు మరవలేదని ఆయానన్నారు. కేంద్రం తీరుతో తెలంగాణ అన్ని రంగాల్లో కలిపి రూ.10లక్షల కోట్లకు పైగా నష్ట పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావల్సినవి ఇవ్వరని, అడిగినవాటిని పట్టించుకోరని, ఏదో చేస్తున్నట్లు ప్రగల్భాలు పలుకడం ప్రధాని మోడికి, బిజెపి నేతలకు అలవాటుగా మారిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News