Monday, December 23, 2024

ఫలక్‌నుమా రైలు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన క్లూస్‌టీం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాదాద్రి -భువనగిరి జిల్లాలో ఫలక్‌నుమా రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో దెబ్బతిన్న 7 బోగీలను శనివారం అధికారులు పరిశీలించారు. బీబీనగర్ వద్ద ఉన్న బోగీలను పరిశీలించిన అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మొదట ఎస్ 4లో మంటలు చెలరేగినట్టు ఈ అధికారుల బృందం ప్రాథమికంగా గుర్తించింది. 12 మంది సభ్యులతో కూడిన ఈ బృందంలో ఢిల్లీ, హైదరాబాద్, గుంటూరుకు చెందిన వారు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి ఆధారాలు సేకరించినట్లు క్లూస్ టీం తెలిపింది.

ఎస్4 బోగీలోని బాత్రూమ్ వద్ద ముందుగా పొగలు వ్యాపించాయని క్లూస్ టీం నిర్ధారించింది. బోగీలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు గుర్తించారు. ఎస్4 బోగీలోని మంటలు ఇతర బోగీలకు వ్యాపించాయని అధికారులు నిర్ధారించారు. కరెంట్ తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించిందని, ఆధారాలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదంపై అధికారులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిఆర్‌పి స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించిన రైల్వే అధికారులు ఈ కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News