Saturday, November 16, 2024

సమాజ దశ,దిశను మార్చేది ఓటు ఒక్కటే

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో కీలకమైన ఓ టు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పిలుపునిచ్చారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కాలనీ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులు, సభ్యులకు అ వగాహన సమావేశం నిర్వహించారు. సీఈఒ వికాస్ రాజ్‌తో పాటు అదనపు సీఈఒ లోకేష్‌కుమార్, సంయుక్త సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిహెచ్ ఎం సి కమిషనర్ రోనాల్ రోస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో తప్పిదాలు సరి చేసుకోవడం, చిరునామా మా ర్పు, పోలింగ్ శాతాన్ని పెంచాల్సిన అవశ్యకత తదితర అంశాలపై అధికారు లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఈఒ వికాస్ రాజ్ మాట్లాడుతూ 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేలా చొరవ చూపాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులను కోరారు.

ఈ దిశగా ఎన్నికల సంఘం చేపడుతున్న చర్యలకు పూర్తి సహకారం అందించాలన్నారు. ఓటర్లు ఎంతో సులభంగా ఆన్ లైన్ విధానం ద్వారా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనూ నిర్ణీత నమూనా ఫారాలను నింపి బి ఎల్ ఓలకు గాని సంబంధిత అధికారులకు అందించవచ్చని సూచించారు.హైదరాబాద్ మహా నగరానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ఉద్యోగ, ఉపాధి అవసరాల రీత్యా పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వస్తుంటారని గుర్తు చేశారు. వీరిలో అర్హులైన ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని నూరు శాతం పోలింగ్ నమోదు అయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఓటు ప్రాధాన్యత గురించి విస్తృత స్థాయి చర్చ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే, తప్పనిసరిగా నిర్ణీత గడువు లోపు సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఓటర్ల నమోదు కోసం సంబంధిత అధికారులు నిర్ణీత నమూనా ఫారాలను వారే స్వయంగా స్వీకరిస్తారని,అసోసియేషన్ల ప్రతినిధులు కొత్త ఓటర్ల నుండి సేకరించకూడదని సూచించారు. ఈ సందర్భంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, గేటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులు పలు సమస్యలను సిఈఒ దృష్టికి తీసుకురావడంతో వాటిని సత్వరమే పరిష్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సైబరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, జీహెచ్‌ఎంసి పరిధిలోని ఈఆర్‌ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News