Monday, November 18, 2024

మీరిన అమెరికా రాయబారి!

- Advertisement -
- Advertisement -

అగ్ర రాజ్యం అమెరికా ఏమైనా అనగలదు, దేనినైనా చేయగలదు. అలా చేయడంలో ఎంత వరకు ఔచిత్యం వున్నదనే అంశాన్ని అది బొత్తిగా పట్టించుకోదు. ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో భారత దేశం భుజం మీద చేయి వేయగలిగేంత చనువును అమెరికా సంపాదించుకొన్నదని చెప్పవచ్చు. భారత దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి గురువారం నాడు కలకత్తాలోని అమెరికా సెంటర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇండియా కోరితే మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో ఎటువంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా వున్నామని అన్నారు. గత రెండు మాసాలుగా మణిపూర్‌లో సాగుతున్న హింసాకాండ మీద, అక్కడి మరణాల మీద, ఆ రాష్ట్రంలోని క్రైస్తవ మైనారిటీలపై జరుగుతున్న దాడుల మీద అమెరికా ఆందోళన చెందడం లేదా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు గార్సెట్టి పై విధంగా సమాధానమిచ్చారు. అదే సమయంలో ఈశాన్య ప్రాంతంలోని పరిస్థితి భారత దేశ అంతర్గత వ్యవహారమని గార్సెట్టి అన్నారు.

‘అశ్వత్థామ హతః.. కుంజరః’ అన్నట్టు వున్నది. ముందు మణిపూర్ విషయంలో కోరితే భారత దేశానికి ఏ సహాయమైనా అందించడానికి అనడంలోని ఆంతర్యం ఏమిటనేది ముఖ్యం. ఆ తర్వాత అది మన ఆంతరంగిక వ్యవహారమని అంగీకరించినప్పటికీ మణిపూర్ సంక్షోభాన్ని భారత దేశం పరిష్కరించుకోలేకపోతున్నదనే అభిప్రాయం ఆయన సమాధానంలో స్పష్టంగా వెల్లడి అవుతున్నది. దేశాల సార్వభౌమత్వ పరిధులను గౌరవించే సంస్కారం లేనివారే ఇలా అనగలరు. మణిపూర్‌లోని హింస పట్ల అమెరికాకు మానవీయ ఆందోళన వున్నదని, కోరితే ఏ విధమైన సహాయం అందించడానికైనా ఇష్టపూర్వకంగా, సిద్ధంగా వున్నదని రాయబారి చెప్పారు. మణిపూర్‌లో శాంతి నెలకొంటుందనే ఆశ వ్యక్తం చేశారు. అక్కడి శాంతి ఆ ప్రాంతంలో ప్రగతికి, పెట్టుబడులు పెరగడానికి దోహదపడుతుందని వివరించారు. అక్కడ శాంతి నెలకొనాలని తాము ప్రార్థిస్తున్నామని అంటూ అమెరికాకి ఏమీ పట్టదా అని మీరు అడిగినప్పుడు అది సైనిక సంబంధమైనదని తాను అనుకోడం లేదని మానవీయ ఆందోళన గానే తాను భావిస్తున్నానని కూడా గార్సెట్టి అన్నారు.

బాలలు సహా ఎంతో మంది బలైపోతుంటే దాని పట్ల ఆందోళన చెందడానికి భారతీయులే కానక్కర లేదని కూడా జవాబిచ్చారు. మొత్తం మీద మణిపూర్‌లో హింస ఎప్పటికీ ఆగకపోడం అనే దాన్ని ఆయన ఎత్తి చూపారు. అంటే భారత ప్రభుత్వం అందులో విఫలమవుతున్నదని అనడమే గదా! ఒక వేళ భారత దేశం అమెరికా సాయాన్ని అడిగిందనే అనుకొందాం, అప్పుడు అది ఏమి చేస్తుంది? హుటాహుటిన సైన్యాన్ని పంపించడానికి కూడా సిద్ధపడవచ్చు. అది భారత దేశాన్ని అమెరికా సైనిక స్థావరంగా మార్చే పరిస్థితులను సృష్టించదా? ఇంత సువిశాల దేశం, బలమైన పోలీసు, భద్రతా బలగాలున్న జాతి అమెరికా సైనిక సాయం మీద ఆధారపడే పరిస్థితిని కొనితెచ్చుకొన్నట్టు కాదా! అమెరికా రాయబారి వ్యాఖ్య గురించి భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చిని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. విదేశీ దౌత్యాధికారాలు సాధారణంగా భారత దేశ ఆంతరంగిక వ్యవహారాల మీద వ్యాఖ్యానిస్తారని తాను అనుకోడం లేదని, అయినా ఆయన ఏమన్నారో పూర్తిగా తెలుసుకోకుండా తాను వ్యాఖ్యానించదలచుకోలేదని బాగ్చి సమాధానమిచ్చారు.

దేశంలోని విదేశీ రాయబారులు, ఇతర దౌత్యాధికారులు ఈ విధంగా మన ఆంతరంగిక సంక్షోభాల గురించి వ్యాఖ్యానించడం అరుదని ఆయన అంగీకరించడం గమనించవలసిన అంశం. ఇది ఇక్కడితో ఆగిపోతుందో, విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా మరింత స్పష్టమైన స్పందన వస్తుందో చూడాలి. ప్రధాని మోడీ ఇటీవల అమెరికాలో అధికారిక పర్యటన చేసి వచ్చిన తర్వాత భారత్ పట్ల అమెరికా ధోరణిలో మార్పు వచ్చిందా అనే అనుమానాన్ని గార్సెట్టి సమాధానం కలిగించడం సహజం. మా దేశంలో సంక్షోభాన్ని మేము పరిష్కరించుకోగలం, ఆ సామర్థం, బలగం, బలం మాకున్నాయి అని అమెరికాకు చెప్పవలసిన అవసరం వుంది. దేశాల సార్వభౌమాధికారం అనేది ఎటువంటి రాజీకి ఆస్కారం లేనిది. దాని రక్షణ కోసం ఏ దేశమూ ఇతర దేశాలపై ఆధారపడవలసిన అవసరం వుండకూడదు. భారత దేశ సార్వభౌమాధికారం విషయంలో ఎటువంటి సందేహాలకు అవకాశం లేదు.

మణిపూర్ సంక్షోభంలో మైనారిటీ కుకీలకు, మెజారిటీ మెయితీలకు మధ్య మే నెల 3వ తేదీ నుంచి పచ్చిగడ్డి కూడా భగ్గుమంటున్నది. ఎడతెగని ఆ హింసలో ఇప్పటికి 120 మంది మరణించడం, వేలాది మంది నిర్వాసితులై శిబిరాల్లో తలదాచుకొంటూ వుండడం వాస్తవం. అయితే అది పరిష్కారానికి అలవికాని సంక్షోభం కాకూడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News