Saturday, December 21, 2024

ఉత్తరభారతంలో వర్షబీభత్సం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో 41 ఏళ్ల తరువాత ఒకేరోజు 153 మిమీ వర్షం ….
రాజధాని వీధులన్నీ జలమయం
హిమాచల్ ప్రదేశ్‌లో ఐదుగురి మృతి
జమ్ముకశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి మూసుకుపోయిన రహదార్లు
రాజస్థాన్‌లో నలుగురి మృతి

న్యూఢిల్లీ : ఉత్తరభారతంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అకస్మాత్తుగా వరదలు ముంచుకొచ్చి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో మునిగిన ఇళ్లల్లో చిక్కుకున్న ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్ లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో వర్షాలకు ఓ ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 41 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఒకేరోజు 153 మి.మీ వర్షపాతం నమోదైంది. 1982 తరువాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం ( ఐఎండి ) పేర్కొంది. ఈ సీజన్‌లో కురవాల్సిన మొత్తం వర్షంలో ఇది 15 శాతానికి సమానం. ఆదివారం కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ లోని ఓ ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలి 58 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఢిల్లీ లోని పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్లు, ఆస్పత్రి ప్రాంగణాలు, మాల్స్, నీట మునిగాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. అత్యవసర సేవల విభాగాల్లో వారాంతపు సెలవులను రద్దు చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఐదుగురి మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు. సిమ్లాలో ముగ్గురు, చంబా, కులు ప్రాంతాల్లో ఒక్కొక్కరు వంతున చనిపోయారు. బీస్ నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండగా, వరద పోటెత్తిన కాంగ్ర, మండి, సిమ్లా తదితర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ , ఎస్డీఆర్‌ఎఫ్ , బలగాలు రంగం లోకి దిగాయి. కులు, మండి మధ్య అనేక చోట్ల కొండచరియలు విరిగిపడడంతో 3 వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పండోహ్ ఏరియాలో నివాసాల్లో చిక్కుకున్న వారిని ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ) బలగాలు రక్షించాయి. కొండచరియలు విరిగిపడడంతో కల్కాషిమ్లా రైల్వే మార్గం లోని కోటి, సన్వారా రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ను తాత్కాలికంగా మాసివేశారు. కులూ బస్టాండ్ సమీపంలో ఓ కాలువ ఉప్పొంగి పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. కాలువ సమీపం లోని ఇళ్లు, రహదారి వెంబడి ఉన్న దుకాణాలు ప్రవాహ వేగానికి తుడుచుపెట్టుకుపోయాయి. కులూ జిల్లా చారుడు గ్రామలో వరదనీటిలో చిక్కుకున్న ఐదుగురిని ఎన్‌డిఆర్‌ఎఫ్ రిస్కూ టీం రక్షించింది. ఈ వర్షాల వల్ల రూ. 362 కోట్ల నష్టం వాటిల్లినట్టు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వాతావరణ కేంద్రం ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు

జమ్ముకశ్మీర్ లోని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. జమ్ము కశ్మీర్ లోని గవారి గండోహ్ జమ్ము మార్గంలో ఓ బస్సును కొండపై నుంచి జారి వచ్చిన బురద ఢీకొనడంతో రోడ్డు పక్కనున్న గోతిలోకి బస్సు పడిపోయింది. బస్సులో చిక్కుకున్న నలుగురిలో ఇద్దరిని పోలీస్‌లు రక్షించగా, మరో ఇద్దరు మృతి చెందారు. గండోహ్ జిల్లా భాంగ్రూ పట్టణం సమీపంలో ఈ సంఘటన జరిగింది. జీలం నదిలో నీటి ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల వారిని వేరే చోటకు తరలించారు.

రాజస్థాన్‌లో నలుగురు మృతి

రాజస్థాన్‌లో గత 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఉత్తరాఖండ్ నదిలో వాహనం బోల్తాపడి తెలుగు వ్యక్తి గల్లంతు

తెహ్రి : ఉత్తరాఖండ్ లోని తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది. వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి నదిలోకి దూసుకెళ్లింది. వాహనం లో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం రక్షించింది. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. బాధితుల్లో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నారు. రాజాం మండలం బొద్దాంకు చెందిన రవి రంగారావు దంపతులు హైదరాబాద్ నుంచి పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో భార్యను విపత్తు నిర్వహణ బృందం రక్షించగా, రవిరావు ఆచూకీ ఇంకా లభించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News