కాన్సులేట్ ఎదుట పోటాపోటీ నిరసనలు
త్రివర్ణ పతాకాలతో భారతీయులు
దాడికి యత్నించిన ఖలీస్థానీయులు
టొరంటో : కెనడాలోని భారతీయ దౌత్యవేత్తల కాన్సులేట్ కార్యాలయం శనివారం వెలుపల చాలా సేపటివరకూ ఉద్రిక్తత నెలకొంది. ఖలీస్థాన్ మద్దతుదార్లకు పోటీగా భారతీయులు కూడా పోటీ ప్రదర్శనకు దిగారు. నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది. తొలుత ఇక్కడికి ఖలీస్థానీ మద్దతుదార్లు వచ్చి భారత వ్యతిరేక నినాదాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. వారి చేతుల్లో ఖలీస్థానీ జెండాలు ఉన్నాయి. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో స్థానిక భారతీయ సంతతికి చెందిన వారు అక్కడికి తరలివచ్చారు. వీరు భారత త్రివర్ణపతాకాలతో , ప్లకార్డులతో, ఖలీస్థానీలు సిక్కులు కాబోరని పేర్కొనే బోర్డులతో వచ్చి ఖలీస్థానీవాదులకు ప్రతిచర్యగా ప్రదర్శన చేపట్టారు. అటు ఖలీస్థానీ నినాదాలు, ఇటు జై భారత్ నినాదాలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది.
చాలా సేపటివరకూ స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్రలో ఉండిపోవల్సి వచ్చింది. పరిస్థితిని గురించి తెలియగానే బారత వౌత్యవేత్త తరణ్‌జీత్ సింగ్ సంధూ వెలుపలికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డుకు ఓ వైపున ఖలీస్థానీలు వచ్చి నిలిచిన దృశ్యాలు, వీరిలో తలపాగా ధరించి ఉన్న ఓ వ్యక్తి భారతీయ జెండాను మలినపర్చడం వంటి ఘటనలు జరిగాయి. ఇదే దశలో మరో వైపున భారతీయ సంతతికి చెందిన వారు జై భారత్ మాత, వందేమాతరం అంటూ నినదించారు. ఓ దశలో ఇండియన్ల వైపు దూసుకువెళ్లడానికి ఖలీస్థానీల బృందం బారికేడ్లను దాటుకుంటూ ముందుకు వెళ్లడానికి యత్నించింది. ఘర్షణలను పోలీసులు నివారించారు.
ఖలీస్థానీ వాదం ఇటీవలి కాలంలో కెనడా ఇతర పాశ్చాత దేశాలలో క్రమేపీ బలంపుంజుకుంది. ఈ దిశలో సిక్క్‌స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) పేరిట వెలిసిన సంస్థ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో దారుణ హత్యకు గురయ్యారు. నిజ్జార్ చాలాకాలం ఖలీస్థాన్ టైగర్ ఫోర్స్‌కు నేతగా చలామణి అయ్యారు. భారతీయ చట్టపరమైన సంస్థలు ఈ వ్యక్తిపై పలు ఉగ్రవాద అభియోగాలను మోపాయి. భారత ప్రభుత్వం ద్వారానే ఖలీస్థానీ నేత హత్య జరిగిందని భావిస్తూ కెనడాలోని ఖలీస్థానీలు పాశ్చాత్య దేశాల్లోని భారతీయ దౌత్యవేత్తలపై దాడులకు పిలుపు నిస్తూ ఇటీవలే ఏకంగా ప్రమాదకర రీతిలో కిల్ ఇండియా ర్యాలీకి పిలుపు నిచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ నుంచి ఎస్‌ఎఫ్‌జెకు, ఇప్పటి ర్యాలీకి మద్దతు ఉందని వెల్లడైంది. కిల్ ఇండియా ర్యాలీకి ఖలీస్థానీ ఉగ్రవాదులు గురుపత్‌వంత్ సింగ్ పన్నూ, పరంజీత్ సింగ్‌పమ్మాలు నాయకత్వం వహిస్తున్నారు. కెనడాలోనే కాకుండా ఖలీస్థానీ మద్దతుదార్లు బ్రిటన్ , ఆస్ట్రేలియాల్లో కూడా ర్యాలీలు చేపట్టారు. భారతీయ దౌత్యవేత్తలపై దాడి, భారత్‌పై వ్యతిరేకత తమ సంకల్పిత లక్షాలని ఖలీస్థానీలు చెపుతున్నారు.
#WATCH | Pro-Khalistan supporters protested in front of the Indian consulate in Canada's Toronto on July 8
Members of the Indian community with national flags countered the Khalistani protesters outside the Indian consulate in Toronto pic.twitter.com/IF5LUisVME
— ANI (@ANI) July 9, 2023