Saturday, December 21, 2024

మెదడు తినే అమీబా… సోకితే ప్రాణాంతకమే

- Advertisement -
- Advertisement -

కేరళలో 15 ఏళ్ల బాలుడిని కలుషిత నీళ్లలో ఉండే అమీబా బలిగొంది. ఈ వ్యాధిని ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫలిటిస్‌గా వైద్యులు నిర్ధారించారు. కేరళలో ఇప్పటివరకు ఐదుగురిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. 2016లో అలప్పుజలో మొదటి కేసు నమోదైంది. ఆ తరువాత 2019-20లలో మలప్పురంలో ఇద్దరికి ఇది సోకింది. 2020, 2022లో కూడా కజికోడ్, త్రిస్సూర్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, తలనొప్పి, వాంతులు , ఫిట్స్ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి సోకిన వాళ్లు బతికే అవకాశాలు అసలు లేవని వైద్యులు చెబుతున్నారు.

ఈ అమీబా కలుషిత నీళ్లలో ఉంటుంది. మనిషి ముక్కు ద్వారా మెదడు లోకి ప్రవేశించి మెదడును తినేస్తుంది. అందుకనే దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమబా అని పిలుస్తుంటారు.ఈ ఇన్‌ఫెక్షన్ నీగ్లీరియా ఫౌలెరీ అనే అమీబా వల్ల వస్తుంది. దీన్ని మైక్రోస్కోప్ ద్వారా గుర్తించవచ్చు. నదులు, చెరువులు, కాలువలు, హాట్ స్ప్రింగ్స్ వంటి మంచినీటి సరస్సుల్లో , నిర్వహణ సరిగ్గా లేని స్విమ్మింగ్ పూల్స్‌లో ఇది విస్తరిస్తుంది. ఉప్పు నీటిలో ఈ అమీబా జీవించలేదు.

అందువల్ల సముద్రాల్లో ఇది కనిపించదు. ప్రస్తుతం ఈ ఇన్‌ఫెక్షన్‌కు ఎలాంటి టీకా లేదు. వివిధ యాంటీబయోటిక్స్ తోనే వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తుంటారు. యాంఫోటెరిసిన్ బి, అజిత్రోమైసిన్, ఫ్లూకోనజోల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్, డెక్సామెథసోన్ వంటి కొన్ని రకాల ఔషధాలతో చికిత్స చేస్తుంటారు. దీన్ని ప్రాథమిక దశలో గుర్తించడం చాలా కష్టం. ఇది అతివేగంగా వ్యాపిస్తుంది. బాధితుడు చనిపోయిన తరువాతనే గుర్తించగలుగుతారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్‌కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి ) ప్రకారం ఈ పరాన్న జీవి ముక్కు ద్వారా మెదడు లోకి ప్రవేశించి కీలక భాగాలపై దాడి చేస్తుంది. దానివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. చివరకు బాధితుడు కోమా లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతాడు.

1962-2021 మధ్య అమెరికాలో 154 మందిపై ఈ అమీబా దాడి చేయగా, కేవలం నలుగురే బతికారు. అయితే మనిషి నుంచి మరో మనిషికి ఇది సోకుతుందన్న ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. 1937 లో అమెరికాలో ఈ అమీబాను మొదట గుర్తించారు. టెక్సాస్‌లో ఓ పదేళ్ల బాలిక స్విమ్మింగ్‌కు వెళ్లినప్పుడు ఈ మెదడు తినే అమీబా ఆమెకు సోకింది. చివరకు ఆమె మరణించింది. దీంతో ఈ వైరస్‌పై అనేక అధ్యయనాలు జరిగాయి. భారత్, అమెరికా, థాయిలాండ్ తదితర దేశాల్లో 2018 వరకు ఇలాంటి కేసులు 381 వరకు నమోదయ్యాయి. గత ఏడాదిదక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తి ఈ అమీబాతోనే మరణించాడు.

Also Read: బ్రెయిన్ ట్యూమర్లను వేగంగా గుర్తించే ‘ఎఐ’ సాధనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News