సంగారెడి: తెలంగాణ ప్రజలతో సిఎం కెసిఆర్‌కు పేగు బంధం ఉన్నదని..కాంగ్రెస్ , బిజెపిలకు ఉన్నది ఫేక్ బంధం అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణా ప్రజలకు అన్నీ తెలుసునని, రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయనన్నారు. సంగారెడ్డి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం సంగారెడ్డి సమీపంలోని ఒక ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణాపై సిఎం కెసిఆర్‌కున్న అవగాహన కాంగ్రెస్ వాళ్లకు ఉన్నదా అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పాలనలో రైతు బీమా ఉన్నదా? రైతు బంధు ఉన్నదా? మిషన్ భగీరథ ఉన్నదా? మిషన్ కాకతీయ ఉన్నదా? అని అడిగారు. తెలంగాణ ప్రజలతో కెసిఆర్‌కు ఫెవికాల్ బంధం ఉన్నదని, అందుకని అనేక వినూత్న పథకాలతో ప్రజల మనిషిగా కెసిఆర్ పేరు గడించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బిజెపి నేతలకు తెలంగాణ ప్రజలతో పేక మేడల బంధం ఉన్నదని, అందుకని అబద్ధపు మాటలతో అధికారంలోకి రావాలని చేస్తున్నారని అన్నారు.తెలంగాణలో ఉన్న పథకాలు ఎక్కడా లేవని, తెలంగాణా రాష్ట్రం బ్రహ్మాండగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. కెసిఆర్ ప్రేమ, పట్టుదలతోనే ఇదంతా సాధ్యమయిందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తి పోతల పథకాలు కెసిఆర్ లేకుంటే వచ్చేవా అని ప్రశ్నించారు. తెలంగాణాకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు గద్దల్లాగా తన్నుకుపోయారుని, నామ మాత్రపు వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇక్కడి ప్రజలను ఉద్దరిస్తున్నట్లుగా బిజెపి నేతలు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. బిజెపి పార్టీ చేసింది దగా, చేసింది మోసం అని ఆయన మండి పడ్డారు. చట్టం ప్రకారం రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందో.. బిజెపి నేతలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక పార్టీ వారు అధ్యక్షున్ని మార్పు చేశారని, మరొక పార్టీ వారు ఔట్ డేటేడ్ లీడర్లను వాళ్ల పార్టీలో చేర్చుకుంటున్నారని, అలాంటి వారా? అధికారంలోకి వచ్చేది ? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.బిఆర్‌ఎస్ వద్దనుకున్న లీడర్లను ఇతర పార్టీల వారు చేర్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారా? 4 వేల పింఛన్ ఇస్తున్నారా? అలాంటిది తెలంగాణా లో ఇస్తామంటే ఇక్కడి ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా ? అని కాంగ్రెస్ లీడర్లను ప్రశ్నించారు.పక్కనున్న కర్ణాటకలో, చత్తీస్ ఘడ్‌లో ఉచిత కరెంట్, పింఛన్లు ఇవ్వండి.. అప్పుడు కాంగ్రెస్ వాళ్లను ప్రజలు నమ్ముతారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడి బిజెపి నేతలు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. దక్షిణాదిపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ , బిజెపిలు ఢిల్లీకి గులాం గిరీ చేస్తున్నారని, వాటికి అధిష్టానం ఢిల్లీలో ఉందని, బిఆర్‌ఎస్‌కు మాత్రం తెలంగాణ ప్రజలే అధిష్టానం అని ఆయనన్నారు. అందుకని తెలంగాణా ఇంటి పార్టీగా బిఆర్‌ఎస్ ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఎంపిలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి, పార్టీ నేతలు విజేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.