హైదరాబాద్ : నిత్యం వివిధ కార్యక్రమాల్లో బీజీ బిజీగా ఉండే ఎంఎల్‌సి కవిత సామాన్య మహిళతో కలిసి సేదతీరారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాసేపు ఆగారు. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. మొక్క జొన్న కంకులు అమ్మే నర్సమ్మతో మాట కలిపారు. సిఎం కెసిఆర్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
తన పేరు నర్సమ్మ అని పేర్కొంటూ నాటి సమైక్య పాలనకు.. నేటి కెసిఆర్ సారు పాలనకు గల తేడాను నర్సమ్మ వివరించింది. తనకే కాదు ఇంటింటికి పింఛన్, పలు సంక్షేమ పథకాలు కెసిఆర్ సార్ మంచిగిస్తుండని కొమురమ్మ సంబురంగా తెలిపారు. స్వయంగా సిఎం కెసిఆర్ కూతురే తన వద్ద మొక్కజొన్న కంకి కొనుగోలు చేసి తింటూ మాట్లాడటంపై నర్సమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఎంఎల్‌సి కవితను చూసిన స్థానిక వాహనదారులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకోగా.. ఎంఎల్‌సి కవిత ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించారు.ముఖ్యమంత్రి కూతురిగా ఉన్నా ఎంఎల్‌సి కవిత సాదాసీదాగా వ్యవహరించారని పలువురు వాహనదారులు చర్చించుకున్నారు.