సిటీ బ్యూరో: భక్తుల పూజలతో తాను సంతోషపడ్డానని, కొంత ఆలస్యమైనా సమృద్ధ్దిగానే వర్షాలు కురుస్తాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు రెండు రోజుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం కీలక ఘట్టం రంగం కార్యక్రమంలో (భవిష్యవాణి)ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మాతంగి స్వర్ణలత వినిపించారు. ఈ ఏడాది సంపూర్ణ పూజలు అందుకున్నామని తెలిపారు. ఏది బయట పెట్టాలో, పెట్టకూడతో నాకు మాత్రమే తెలుసునని, గతేడాది తనకు మాట ఇచ్చి ఎందుకు మరిచిపోయారని ప్రశ్నించారు.
మరో ఐదు వారాల పాటు తనకు ముత్తైదులందరూ భక్తిశ్రద్ధ లతో పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి సాకాలు పోస్తే మరింత సంతోషంగా ఉంటానన్నారు. వర్షాలు కురుస్తాయని కాని కొన్ని ఒడిదుడుకు తప్పవన్నారు. అగ్ని ప్రమాదాలు సైతం సంభవిస్తాయని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తన దగ్గరకు వచ్చిన ప్రజలంతా సంతోషంగా ఉండేలా, ఎవరికి ఎటువంటి ఆపద కలగకుండా చూసుకునే బాధ్యత తనదేనని అన్నారు. గడపగడపను కాపాడే భారం తనదేనంటూ భవిష్యవాణి ముగించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారి భవష్యవాణి శద్ధ్ద్రగా ఆలకించారు.