జగిత్యాల: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం రోజున సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఓటు నమోదు కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటు హక్కు నమోదుపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాలలు, కళాశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడం ద్వారా నిజమైన, ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా సిద్దం చేయవచ్చన్నారు.
ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన నిర్ణీత ఫారాలను వినియోగించే అంశాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే వారు ఫారం 6లో దరఖాస్తు చేసుకోవాలని, అభ్యంతరాలు, తొలగింపులకు ఫారం 7 ద్వారా, మార్పులకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అంగవైకల్యం కలిగి ఉండి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకోవాలని, పిడబ్లూడి ఓటరుగా గుర్తించాలన్నారు. జిల్లాలోని ప్రజలకు ఫారాల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవచ్చని, ఇప్పటికే 17 ఏళ్లు పైబడిన వారు కూడా తమ పేరును స్థానిక బూతు స్థాయి అధికారులు, రెవెన్యూ కార్యాలయాల్లో, ఎన్‌విడిఆర్ ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు.
జిల్లాలోని యువత తమ పేరును తప్పని సరిగా ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, స్వయం సహాయక మహిళా సంఘాలు వారి గ్రూపులోని, గ్రామంలో అర్హత గల వారిని ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో జరిగిన గత ఎన్నికల్లో పోలింగ్ శాతం మందకోడిగా జరిగిందని, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, జిల్లా సంక్షేమాధికారి నరేశ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి సాయిబాబా, జిల్లా పౌరసంబంధాల అధికారి భీంకుమార్ తదితరులు పాల్గొన్నారు.