హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బిజెపి ప్రాతినిధ్యం లేని ప్రాంతం, సామాజిక వర్గం లేదు.. ప్రజలంతా ప్రధాని మోడీ పాలన పట్ల మొగ్గు చూపుతున్నారని బిజెపి ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాదిలో బిజెపిని విస్తరించే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు జాతీయ నాయకత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ ఎన్నికల బాధ్యులుగా ప్రకాష్ జవదేకర్, సునీల్ ను నియమించారని వెల్లడించారు.
స్థానిక అంశాల ప్రభావితంతోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీకి ఓటు వేసేందుకు కర్ణాటక ప్రజలు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు.రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పట్ల విసుగు చెందిన ప్రజలు బిజెపికి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. వరంగల్ సభకు హాజరైన ప్రజలను చూస్తే ఇది అర్థం అవుతోందన్నారు. ప్రధాని హోదాలో మోడీ బిఅర్‌ఎస్ పై విరుచుకు పడ్డారని గుర్తుచేశారు.
అవినీతి వల్లే బిఆర్‌ఎస్ నేతలు.. ప్రధానికి ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పట్ల ప్రధాని మోడీ అవేదనతో ఉన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ 30 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొడతారు. దళితబంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు. ఆ పార్టీ నేతలు ఒకరి అవినీతి ఒకరు బయటపెట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఆదరిస్తారు‘ అని లక్ష్మణ్ తెలిపారు. సమావేశంలో రాష్ట్ర బిజెపి నేతలు పాల్గొన్నారు.