Friday, November 15, 2024

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో టిఎంసి జోరు.. చతికిలపడ్డ బిజెపి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ( టిఎంసి) జోరు కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 4.30గంటల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 63,229 గ్రామపంచాయతీల్లో టిఎంసి 12,518స్థానాల్లో విజయం సాధించగా మరో 3,620 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక భారతీయ జనతా పార్టీ 2,781 స్థానాల్లో గెలుపొంది, మరో 915 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. లెఫ్ట్‌ఫ్రంట్ 959 స్థానాల్లో గెలిచి మరో 550 చోట్ల ఆధిక్యతలో ఉంది. లెఫ్ట్‌ఫ్రంట్ గెలుపొందిన సీట్లలో సిపిఎం ఒక్కటే 910 స్థానాలు దక్కించుకుంది.

కాంగ్రెస్ పార్టీ 625 సీట్లు గెలుచుకుని మరో 276 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇతర పార్టీల్లో కొత్తగా ఏర్పాటయిన ఐఎస్‌ఎఫ్ 219 స్థానాల్లో గెలుపొందగా మరో 70 చోట్ల ఆధిక్యతలో ఉంది. ఇక స్వతంత్రులు 718 సీట్లు గెలుచుకోగా మరో 216 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఇక 928 జిల్లా పరిషత్ స్థానాల్లో టిఎంసి 16 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. పంచాయతీ సమితుల్లోను తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 74 వేల పంచాయతీ స్థానాలకు గత శనివారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున చెలరేగిన హింసాకాండలో కనీసం 15 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.144 సెక్షన్‌ను విధించడంతో పాటుగా కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దింపారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 339 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్త కావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారులు అంటున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34 శాతం సీట్లలో టిఎంసి ఏకగ్రీవంగా ఎన్నికయింది. మిగతా స్థానాల్లో 90 శాతం సీట్లలో విజయం సాధించింది. అయితే ఈ సారి ప్రతిపక్షాలు దాదాపు 90 శాతం స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News