పెద్దపల్లి: తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేసి సుల్తానాబాద్ సర్కిల్ పరిధి పోలీసులు ఎనిమిది దొంగతనం కేసులను చేదించారు. దొంగతనానికి పాల్పడిన జెట్ పట్ పవన్‌ను అరెస్ట్ చేయడంతో పాటు రూ.12.11 లక్షల నగదు, 102 గ్రాముల బంగారం, 945 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి నిందితుని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన 8వ తరగతి చదివి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న జెట్ పట్ పవన్ 2022లో మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసిన విషయంలో చెన్నూరు, బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
ఆ సమయంలో జైలుకు వెళ్లిన పవన్ తోటి ఖైదీలతో దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నాడని, జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత పగటి పూట తాళం వేసిన ఇళ్లను పరిశీలించి రాత్రి పూట దొంగతనాలకు పాల్పడేవారన్నారు. నిందితుడు పవన్‌పై సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కాల్వశ్రీరాంపూర్‌లో ఐదు, పొత్కపల్లిలో ఒక ఇంటిలో చోరికి పాల్పడినట్లు తెలిపారు.
ఈ నెల 5న సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న రావుల మల్లయ్య ఇంటిని తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.11 లక్షల నగదు, 25 తులాల వెండి, ఆరున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డీసీపీ, ఏసీపీ బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్న క్రమంలో మంగళవారం ఉదయం కాల్వశ్రీరాంపూర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహించారు.
అటువైపుగా అనుమానస్పదంగా తిరుగుతున్న పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తాను చేసిన చోరీల విషయం బయటపడిందన్నారు. అతని వద్ద నుండి నగదు రూ.12.11 లక్షలు, 102.08 గ్రాముల బంగారం,645 గ్రాముల వెండి అభరణాలతోపాటు ఆపిల్ సెల్ ఫోన్, పల్సర్ బండి వాహనం సుమారు రూ.19.11 లక్షల విలువగల వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ప్రజలు విలువైన ఆభరణాలు, ఎక్కువ మొత్తంలో నగదు ఇళ్లలో భద్ర పర్చుకోవద్దని తెలిపారు. కుటుంబ సభ్యులు ఊళ్లకు, యాత్రలకు వెళ్లిన సందర్భంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. దొంగతనం కేసులను చేదించిన సుల్తానాబాద్ సీఐ జగదీష్, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయేందర్, అశోక్, ఏఎస్‌ఐ తిరుపతి, రఘు, సిబ్బంది దుబాసి రమేష్, రాజేష్, రమేష్‌లను సీపీ అభినందించి నగదు రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ మహేష్‌లతోపాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు.