Monday, November 18, 2024

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

- Advertisement -
- Advertisement -
ప్రొబేషన్ పీరియడ్‌లో పనితీరుపై పరిశీలన
నిర్దేశించిన లక్షాల్లో మూడింట రెండొంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్
విఆర్‌ఎల సర్దుబాటుకు మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ఉపసంఘం
అభిప్రాయాల సేకరణకు వారితో నేటి నుంచి చర్చలు సచివాలయంలో ఆగస్టు 25న మూడు ప్రార్థనా మందిరాలకు ప్రారంభోత్సవం
ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు

హైదరాబాద్: రాష్ట్రంలో విఆర్‌ఎ, విఎఒల సర్దుబా టు, పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరును పరిశీలించి ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని నిర్ణయించడంతో పాటు విఆర్‌ఎల సర్దుబాటుపై మంత్రి కెటిఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. తె లంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయి తీ కార్యదర్శుల పాత్రను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ సం దర్భంగా అభినందించారు. దేశవ్యాప్తంగా వున్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడివున్నదని అన్నారు. సాధించిన దానితో సంతృప్తిని చెంది అలసత్వం వహించకూడదని, తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే ది శగా పంచాయితీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే వుం డాలని సిఎం ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో.. తమ నాలుగు సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేషించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ని ర్ణయించారు. రాష్ట్రంలో విఆర్‌ఎ, విఎఒల సర్దుబాటు, విలేజ్ సెక్రటరీల రెగ్యులరైజేషన్, సచివాలయంలో దేవస్థానం, మసీదు, చర్చ్‌ల ప్రారంభోత్సవాల తేదీల ఖరారు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాల్లో… మంత్రులు కె.టి.రామారావు, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, ఎంఎల్‌సిలు మధుసూధనా చారి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్‌ఎలు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, సుంకె రవిశంకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, సిఎస్ శాంతి కుమారి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సిఎంఒ కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంత రావు, ఆర్ అండ్ బి ఇఎన్‌సి గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు, ఉపాధ్యక్షులు నేతి మంగ, యూసుఫ్ మియా, వేద పండితులు గోపికృష్ణ శర్మ, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం…మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో పాటు పలు రకాల బాధ్యతలను చేపట్టాలనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం వారికి విధిగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ ప్రొబేషన్ పీరియడ్‌ను పూర్తి చేసుకున్న కార్యదర్శులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్థేశించిన లక్ష్యాలను మూడింట రెండు వంతులు చేరుకున్న వారికి రెగ్యులరైజ్ చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
విఆర్‌ఎల సర్దుబాటుపై చర్చలకు మంత్రివర్గ ఉపసంఘం
రాష్ట్రంలో పనిచేస్తున్న విఆర్‌ఎ (విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్)లను, వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విఆర్‌ఎలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు. ఇందుకు గాను, మంత్రి కె.టి.రామారావు ఆధ్వర్యంలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో కూడిన మంత్రి వర్గ ఉప సంఘాన్ని సిఎం కెసిఆర్ ఏర్పాటు చేశారు.సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం విఆర్‌ఎలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనున్నది. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుని విఆర్‌ఎల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉపసంఘం కసరత్తు పూర్తయి తుది నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ వారంలోపు పూర్తి కావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
వచ్చే నెల 25న సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం
సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్పూర్తి ప్రతిఫలించే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో గంగా జమునీ తహెజీబ్‌ను మరోమారు ప్రపంచానికి చాటే దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చీలను ఒకే రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా మత పెద్దలను సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 25వ తేదీన హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని సిఎం పున: ప్రారంభిస్తారు. అదే రోజున ఇస్లాం, క్రిస్టియన్ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో మసీదును, చర్చీని సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు.

ఈ మేరకు మంత్రులు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఎంఒ అధికారులు, ఆర్‌అండ్‌బి ఆధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ,ముస్లిం, క్రిస్టియన్ మతాల పెద్దలతో సంప్రదించి ఒకే రోజున మూడు మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించే చారిత్రక నిర్ణయాన్ని సిఎం కెసిఆర్ తీసుకున్నారు. తద్వారా సచివాలయ ఉద్యోగులకు ఈ మూడు ప్రార్థనా మందిరాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యవర్గంతో కూడా సిఎం కెసిఆర్ చర్చించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News