అన్ని విషయాలలో వివాదాస్పదమవుతున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ విషయంలోనూ విమర్శలకు గురైంది. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పరువు కాపాడుకునే ప్రయత్నంలో కేంద్ర హోం మంత్రి విలేకరులకు సింగోల్ విషయం వెల్లడించారు. ఎవరికీ తెలియని ఒక అప్రధానమైన సింగోల్‌ను ఎందుకు తెర మీదికి తెచ్చారూ? అంటే నూతన పార్లమెంటు ప్రారంభోత్సవ వివాదాన్ని కప్పి పుచ్చుకోవడానికి! నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని శంకుస్థాపన చేసినప్పుడే భగ్గుమంది. అశోక చక్రంపై నిర్మించిన కొత్త సింహాలు రౌద్రంగా వున్నాయన్న విమర్శలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆ భవన ప్రారంభోత్సవం కూడా ఆయనే చేయడం వల్ల విపక్షాలే కాదు, దేశ ప్రజలు సైతం కినుక వహించారు. ఎందుకంటే పార్లమెంటు వ్యవస్థలో మొదటి స్థానం దేశాధ్యక్షులది. తర్వాత రాజ్యసభది. ఆ తర్వాత లోక్‌సభది. ఆ వరుస క్రమంలో లోక్‌సభ నాయకుడుగా ప్రధానిది మూడో స్థానం. మొదటి వారిని వదిలేసి, మూడో స్థానంలో వున్న వారు ప్రారంభించడం ఏమిటని విపక్షాలు నిరసన తెలియజేశాయి. మొత్తానికి మొత్తంగా కార్యక్రమాన్నే బహిష్కరించాయి.
దేశాధ్యక్షులంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ సైన్యాధినేత ఎవరో వారే దేశాధినేత అవుతారు. పార్లమెంటులో ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించేది కూడా దేశాధ్యక్షులే. ఇక్కడ లింగ భేదం వుండదు. అధ్యక్ష స్థానంలో వున్నది గిరిజన మహిళనా? భర్త లేని మహిళనా అని చూడగూడదు. మత మౌఢ్య వ్యవస్థలో మాత్రమే అధ్యక్షుల వారిది ఏ కులం? ఏ మతం ? భర్త లేదా భార్య జీవించి వున్నారా లేదా అనేది చూసుకుంటారేమో గాని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని పక్కన పెట్టాల్సిందే! భారత రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని ప్రతిష్టించాలని కలలు కంటున్న ఆర్ఎస్ఎస్ బిజెపి వారి విధానాలు ఈ విధంగా అస్తవ్యస్తంగానే వుంటాయి. మనువాదులు ఏర్పరిచిన నిచ్చెన మెట్ల కుల సంస్కృతి ప్రకారం ప్రస్తుత ప్రధాని అగ్ర వర్ణం వాడు కాదు. పూజలకు అతను ఎలా పనికొచ్చాడు? పైగా హిందూ ధర్మం ప్రకారం ఏ పూజలైనా సతీసమేతంగా చేయాలి. మరి ఈ ప్రధాని అలా చేయలేదు కదా? వారి ధర్మం ప్రకారం ఒంటిగా చేసిన పూజలు, సాష్టాంగ ప్రణామాలు అన్నీ మంచి ఫలితాలనిస్తాయా? ఇవి సామాన్యుల అనుమానాలు…
మనది ప్రజాస్వామ్య దేశం గనుక, అన్ని మతాలకూ సమానమైన విలువ నివ్వాలి. అలాంటప్పుడు ఏ ఒక్క మతానుసారం హోమాలు, పూజలు ఎలా నిర్వహిస్తారూ? ఛార్టెడ్ ప్లేన్ పంపి తమిళనాడులోని ఆధీనం మఠానికి చెందిన సాధువులను ఢిల్లీకి పిలిపించుకొన్నారు కదా? మరి ఇతర ప్రతినిధుల్ని నామమాత్రంగానైనా పిలవలేదే? అసలైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో మతాల్ని, మత సంబంధమైన పూజా కార్యక్రమాల్ని పక్కన పెట్టి, వాటికి అతీతంగా వ్యవహరించాల్సి వుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని అతిక్రమించింది. సింగోల్ అంటే రాజదండం అనీ, అది తన చేతికి వచ్చింది గనుక, తనకు పట్టాభిషేకం జరిగిందనీ ఇక అధికారమంతా తనదే అని ప్రధాని భావిస్తూ వుండొచ్చు. ఒకప్పుడు నెహ్రూ చేతిలో వున్న రాజదండం ఈ రోజు తన చేతిలో కొచ్చిందని సంబరపడుతూ వుండొచ్చు.
అసలు విషయమేమంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజదండానికి గాని, రాచరికానికి గానీ ఎలాంటి విలువా లేదు వుండదు! చాలా శ్రద్ధగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అలహాబాద్ మ్యూజియంలో అప్పుడు పని చేసిన క్యురేటర్ ఓంకార్ ఆనందరావు వాంఖ్డే చెప్పిన దాని ప్రకారం అది “పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు బహుమతిగా వచ్చిన ఒక బంగారు చేతికర్ర” మాత్రమే నెహ్రూ తన వస్తువుల్ని మ్యూజియంకు బహూకరించినప్పటి నుండి అంటే 1952 నుండి అది అక్కడే అలహబాద్ మ్యూజియంలో వుంది. ఇప్పుడు అక్కడ వున్నదీ ఆధీనం మఠం వారిచ్చిన సింగోల్కు ప్రతి రూపం. ఒరిజినల్ సింగోల్, ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో వుంది. నెహ్రూజీ దాన్ని తన స్వంత ఆస్తిగా దాచుకొన్నాడని అధికార పార్టీ వారు చెప్పడం అబద్ధం. ఎందుకంటే ఆ ఒరిజినల్ సింగల్నే ఢిల్లీ నేషనల్ మ్యూజియం నుంచి తెప్పించి మోడీ గారు పూజలు చేసి కొత్త పార్లమెంటులో ప్రతిష్టంచారు.
ఏదీ ఏమైనా ప్రొఫెసర్ మాధవన్ కె. పలట్ చెప్పిన విషయం ఈ దేశ ప్రజలు నమ్మి తీరాలి. ఆయన చరిత్ర పరిశోధకుడు మాత్రమే కాక, ఎన్నిక చేసిన నెహ్రూ రచనలకు (సెలెక్టెడ్ వర్క్ ఆఫ్ జవహల్ లాల్ నెహ్రూ) సంపాదకుడు.
అంతేకాదు, నెహ్రూ మెమోరియల్ ఫండ్‌కు ట్రస్టీ కూడా! “సింగోల్ మౌంట్ బాటెన్కు అందించి, మళ్ళీ తీసుకొచ్చి నెహ్రూకు ఇచ్చారనడం శుద్ధ అబద్ధం! అందుకు ఏ ఆధారమూ లేదు” అని ప్రొఫెసర్ మాధవన్ కె. పలట్ కొట్టి వేశారు. ఇవన్నీ కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ అల్లిన తప్పుడు కథలని ఆయన కరన్ థావర్కి ఇచ్చిన ఇంటర్వూలో తేల్చి చెప్పారు. అలహాబాద్‌లోని ఆనంద నిలయం నెహ్రూ కుటుంబీకుల స్వంత ఆస్తి. కాలక్రమంలో అది మ్యూజియం అయింది. నెహ్రూ వస్తువులు, వచ్చిన బహుమతులు అన్ని అందులో భద్ర పరిచారు. ఇందిరా గాంధీ వచ్చాక ఆనంద నిలయాన్ని జాతికి అంకితం చేశారు. అప్పటి నుండి అది పబ్లిక్ ప్రాపర్టీ అయింది. నేటి ప్రభుత్వ పెద్దలు నెహ్రూ విలువను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టే ఈ విషయంలో కూడా చేశారు. నెహ్రూ కావాలని తన ఆధీనంలో వుంచుకొన్నాడనీ, తన చేతి కర్ర అని చెప్పుకొన్నాడనీ అభాండాలు వేస్తున్నారు.
అధికార మార్పిడికి చిహ్నంగా సింగోల్‌ను నెహ్రూ స్వీకరించ లేదు. అధికార మార్పిడి అంటే బ్రిటీష్ రాజు ఛార్లెస్ 6 నుండి నాటి తొలి భారత రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్‌ల మధ్య జరగాలి. కాని జరగలేదు. ప్రజాస్వామ్యంలో దేశాధ్యక్షుడే దేశానికి అధిపతి. ప్రధాని కాదు. అది నెహ్రూ సమయంలోనైనా లేక ఇప్పుడు మోడీ సమయంలోనైనా పద్ధతి పద్ధతే. అలా జరగనప్పుడు దానికి ఏ విలువా వుండదు. కాంగ్రెస్ నుండి తాము అధికారం హస్తగతం చేసుకొన్నామని ఆర్ఎస్ఎస్ బిజెపిలు సంబరాలు చేసుకుంటే చేసుకోవచ్చు. నూతన పార్లమెంటు భవనంలో హోమాలు, పూజలు, సాష్టాంగ ప్రణామాలూ చేసి మనువాదం పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటే చాటుకోవచ్చు. అవన్నీ ఈ దేశ ప్రజల దృష్టిలో అప్రజాస్వామికమైనవి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరిపించడం అసలు ఎవరూ హర్షించరు.
తిరువదుతిరై ఆధీనం మఠం వారు 14 ఆగస్టు 1947 న నెహ్రూజీకి సింగోల్ బహూకరించినపుడు ఇందిరా గాంధీ, పద్మజా నాయుడు ఇద్దరూ అక్కడే వున్నారు. ఒకవేళ అది అధికార మార్పిడికి చిహ్నం అని అనుకొని వుంటే, వారు ఎన్నో చోట్ల, ఎన్నో సార్లు దాని గురించి మాట్లాడేవారు, రాసేవారు. వారు ఆ పని చేయలేదు. చరిత్రకారులెవరూ ఆ సంఘటనకు ప్రాధాన్యమివ్వలేదు. అదీగాక సి. రాజగోపాలా చారి (రాజాజీ) మనుమడు రాజమోహన్ గాంధీ ఎప్పుడూ, ఎక్కడా సింగోల్ గురించి రాయలేదు. ఎందుకంటే ఆయన రాజాజీ మనుమడు మాత్రమే కాదు, ప్రసిద్ధ చరిత్రకారుడు. అంత ప్రాముఖ్యమున్న విషయమైతే ఆయన ఆ విషయాన్ని ఎందుకు వదిలేస్తారూ? గోపాల్ కృష్ణ గాంధీ అయితే అసలు ఆ విషయమే తనకు తెలియదన్నాడు. ఈ సోదరులు పార్లమెంటు వ్యవస్థలో వున్నవారు. ఇటు రాజాజీ అటు గాంధీజీ కుటుంబాలకు చెందిన వారు. వారెందుకు అధికార మార్పిడికి చిహ్నం అయిన సింగోల్ ప్రసక్తి ఎక్కడా తీసుకు రాలేదు? అంటే ఇది నేటి కేంద్ర హోం మంత్రి వండి వార్చిన అబద్ధాల వంటకం అని తేలిపోయింది! ఈ వాస్తవాలన్నీ తెలిశాక కేంద్ర గృహ మంత్రి మాటల్లో నిజమెంతో తేటతెల్లమైంది.
అలహాబాద్ మ్యూజియంలో వున్నది ఒరిజినల్ సింగోల్ కాదు. దాని ప్రతిరూపం మాత్రమే! ఒరిజినల్ సింగోల్ ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో వుంది. దాన్ని నెహ్రూ తన స్వంత ఆస్తిగా దాచిపెట్టుకోలేదు. 2. అది తన బంగారు చేతికర్ర అని ఎప్పుడూ, ఎక్కడా చెప్పుకోలేదు. మ్యూజియం క్యురేటర్ల ప్రకటనల్ని మనం గమనించాలి. 3. అధికార మార్పిడి జరిగినప్పుడు స్వీకరించింది అని చెప్పడానికి వీలే లేదు. నెహ్రూజీకి అందిన ఎన్నో బహుమతులలో ఇది ఒకటి! 4. ఇప్పుడు అధికారం ఎవరి నుండి ఎవరికి మారిందనీ? బిజెపి మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ళుగా అధికారంలోనే వుంది. ఇదంతా వృథా ప్రయాస 5. పెరిగిన ధరలు, నిరుద్యోగం, బ్యాంకు దోపిడీ గాళ్ళు, ప్రైవేటుకు పెద్ద పీట, మహిళా రెజ్లర్ల లైంగిక హింస, పతనమైన రూపాయి విలువ, ఆకలి సూచీ, కనీవినీ ఎరగని రైలు ప్రమాదాలు వంటి ఎన్నెన్నో అంశాల నుండి దేశ ప్రజల దృష్టి మరల్చడానికి మ్యూజియంలో ఓ మూల పడి వున్న వస్తువును తెచ్చి ఈ ప్రభుత్వ పెద్దలు సంచలన వ్యాఖ్యలు చేశారన్న మాట. 6. గత ప్రభుత్వం ఏం చేసిందని మాటి మాటికీ ప్రశ్నించే ఈ దేశ ప్రధాని ఇదిగో ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి చూపుతున్నారు.
14 ఆగస్టు 1947 సాయంత్రం, గవర్నర్ జనరల్, చివరి వైస్రాయ్ అయిన మౌంట్ బాటెన్ కరాచీ నుండి ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగాడు. ఆయన అప్పుడే పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చాడు. ఎందుకంటే, ఆ దేశానికి కూడా స్వాతంత్య్రం వచ్చింది ఆ రోజే. మళ్ళీ ఆ రోజు రాత్రి ఢిల్లీ పార్లమెంటులో వుండాలి. అక్కడ రాత్రి 11.30 కు నెహ్రూజీ తొలిసారి ప్రసంగించబోతున్నారు. అంతటి ముఖ్యమైన కార్యక్రమాల మధ్య ఆధీనం మఠం వారు మౌంట్ బాటెన్ కలిసి సింగోల్ ఇచ్చారనడం వంద శాతం అబద్ధం.
వైస్రాయ్ అంటే మామూలు విషయం కాదు. ఏ నిమిషానికి ఎవరు వచ్చి వెళ్ళారన్నది అంతా రికార్డు వుంటుంది. ఆ సాయంత్రం తమిళనాడు మఠాధిపతులు మౌంట్ బాటెన్ దగ్గరికి వచ్చిన రికార్డేది లేదు. అదంతా ఇప్పటిఈ గృహ మంత్రి సృష్టించిన రికార్డు! అంతా గమనిస్తే, మరొక విషయం తోస్తుంది. అబద్ధాలతోనైనా.. ఏదో విధంగా తమిళనాడులో నేటి స్టాలిన్ ప్రభుత్వాన్ని కదిలించాలన్న పథకాలు సిద్ధమవుతున్నాయేమో!
చివరగా ఇంకా ఒక ఆధారం వుంది. డొమినిక్యు లిపిర్రి; లార్రి కొల్లిన్స్లు కలిసి ఇండియన్ ఇండిపెండెన్స్ మీద FREEDOM AT MIDNIGHT అనే ఒక పెద్ద గ్రంథం రచించారు. అందులో అసలు సింగోల్ ప్రసక్తే లేదు. అధికార మార్పిడికి సింగోల్ చిహ్నమైతే, ఆ రచయితలు దాని గురించి తప్పక రాసి వుండే వారు కదా? 1012 శతాబ్దాల నాటి చోళరాజుల సింగోల్‌ను తవ్వి తీసి ఈ 21వ శతాబ్దానికి తీసుకొచ్చారంటే ఏమనుకోవాలి? ఈ సింగోల్ నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఒక ‘సెర్జికల్ స్ట్రైక్’ అని అనుకోవాల్సి వుంటుంది!
డా. దేవరాజు మహారాజు