హైదరాబాద్: తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత కన్నెర్ర చేశారు. తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.ఈ మేరకు కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తే కాంగ్రెస్ కి వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు.
కేవలం మూడు గంటల పాటు రైతులకు విద్యుత్తు ఇస్తే సరిపోతుందని పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు చూసి తీవ్రంగా ఆశ్చర్యపోయానని తెలిపారు. రాహుల్ గాంధీ గారు…. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందుల పాలు చేయాలనుకుంటున్నారా ?” అని అడిగారు. బిఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.