మనతెలంగాణ/హైదరాబాద్: రాగల నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 4.5కి.మి నుండి 7.6కి. మి ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశగా వంగి ఉన్నట్టు తెలిపింది. బుధవారం మరోక ఆవర్తనం ఉత్తర కోస్తా మీదుగా సగటు సముద్రమట్టం నుండి 3.1 కి.మి ఎత్తు వద్ద ఏర్పడినట్టు తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశవైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.వీటి ప్రభాంతో రాగల నాలుగు రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అదిలాబాద్, కొమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీనంగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. బుధవారం రాష్ట్రంలో తేలకపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా గార్లలో అత్యధికంగా 73.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 69.5, మెదక్ జిల్లా కేంద్రంలో 66.5, శకంరంపేటలో 66, రాజ్‌పల్లిలో 65.5, నిర్మల్ జిల్లా పెంబిలో 62.5, నిజామాబాద్ జిల్లా ముప్కల్‌లో 60.8, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌లో 60.5 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలో కారేపల్లి, పొన్కల్, మెండొర, కుల్చారం, సర్ధాన, వడ్యాల, లక్మాపూర్ అక్కాపూర్ కడ్పాల్, కొండపాక, లక్ష్మణ్ చంద, రేబర్తి, తుక్కాపూర్, నాగిరెడ్డిపేట, మిన్‌పూర్ డుల్మిట్ట, కొమురవెళ్లి తదితర ప్రాంతాల్లో 46మి.మి పైగా వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.